
గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా ఈ సామెత బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌కు సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు.
ఒకట్రెండు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటకి డెబ్యూ చేసే అవకాశం మాత్రం రాలేదు. అయితే 31 ఏళ్ల ఈశ్వరన్ త్వరలోనే టీమిండియా క్యాప్‌ను అందుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు అభిమన్యును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు బ్యాకప్‌గా అతడిని ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ పంపించాలని భావిస్తుందంట.
హిట్‌మ్యాన్ వ్యక్తిగత కారాణాలతో తొలి రెండు టెస్టులో ఏదో ఒక మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ స్ధానంలో అభిమన్యు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా ఈశ్వరన్ కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తిపరిచాడు.
"నేను ఎప్పుడూ ప్రస్తుతం కోసమే మాత్రమే ఆలోచిస్తాను. భవిష్యత్తు కోసం పెద్దగా ఆలోచించను. కానీ కొన్నిసార్లు అది అంత సులభం కాదు. ఆ సమయంలో ఏదీ మన చేతుల్లో ఉండదని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను. మనకంటూ ఒక రోజు వస్తుందని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను.
దేశం తరఫున ఆడాలనేది నా కల. అందుకోసం ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నాను. భారత జట్టులో ఉండాలని, విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. కానీ మనం ఆశలు పెట్టుకున్నప్పటకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతానికి, నేను రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను.
బెంగాల్‌కు విజయాలను అందించడమే నా ముందున్న లక్ష్యమని" అభిమన్యు NDTV స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 53.63 సగటుతో 7506 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 26 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment