దివాన్ బల్లూభాయ్ కప్ అండర్-19 మల్టీ డే టోర్నమెంట్‌లో గుజరాత్ యువ క్రికెటర్ ద్రోణ దేశాయ్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో సెయింట్ జేవియర్స్ స్కూల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 18 ఏళ్ల ద్రోణ దేశాయ్.. జెఎల్ ఇంగ్లిష్ స్కూల్‌పై మారాథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దేశాయ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగాడు. తృటిలో 500 పరుగుల మార్క్‌ను ఈ గుజరాతీ చేజార్చుకున్నాడు.
దేశాయ్ ఊచకోత..
రిపోర్ట్స్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే సెయింట్ జేవియర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ద్రోణ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.
ఈ క్రమంలో ద్రోణ మొదట హెట్ దేశాయ్‌తో కలిసి 350 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత జట్టు కెప్టెన్ విరాట్ తలతితో కలిసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 320 బంతులు ఎదుర్కొన్న దేశాయ్.. 86 ఫోర్లు, 7 సిక్స్‌లతో 498 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్‌ను అందుకునే వాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జేవియర్స్ 844 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 845 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెఎల్ ఇంగ్లిష్ స్కూల్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 712 పరుగుల తేడాతో సెయింట్ జేవియర్స్ ఘన విజయాన్ని అందుకుంది.
ఎవరీ ద్రోణ దేశాయ్?
గుజరాత్‌కు చెందిన ద్రోణ దేశాయ్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. తన 7ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ ఆడటం దేశాయ్ మొదలు పెట్టాడు. అతడు ఇప్పటికే గుజరాత్ అండర్-19 జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ద్రోణ క్రికెట్ జర్నీ వెనక అతడి తండ్రిది కూడా కీలక పాత్ర అనే చెప్పాలి. చిన్నతనంలో అతడి ప్రతిభను గుర్తించి క్రికెట్ కోచింగ్ ఆకాడమీలో చేర్చాడు. అదే విధంగా కోచ్ జయప్రకాష్ పటేల్ కూడా అతడిని మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.
ఇక స్కూల్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా దేశాయ్ నిలిచాడు. ఈ జాబితాలో ప్రణవ్ ధనవాడే (1009*), పృథ్వీ షా (546) ఉన్నారు.
చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే?
Comments
Please login to add a commentAdd a comment