ముషీర్‌ ఖాన్‌ భారీ శతకం.. ఇండియా-ఏపై ఇండియా-బి విజయం | Duleep Trophy 2024: India B Beat India A By 76 Runs | Sakshi
Sakshi News home page

ముషీర్‌ ఖాన్‌ భారీ శతకం.. ఇండియా-ఏపై ఇండియా-బి విజయం

Published Sun, Sep 8 2024 4:44 PM | Last Updated on Sun, Sep 8 2024 5:28 PM

Duleep Trophy 2024: India B Beat India A By 76 Runs

బెంగళూరు వేదికగా జరిగిన దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-ఏపై ఇండియా-బి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-బి.. ముషీర్‌ ఖాన్‌ భారీ శతకంతో (181) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్‌.. నవ్‌దీప్‌ సైనీ (56) సహకారంతో ఆదుకున్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 4, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో 2, కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కలిసికట్టుగా రాణించిన ఇండియా-బి బౌలర్లు
ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీ తలో 3, సాయికిషోర్‌ 2, యశ్‌ దయాల్‌, సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఐదేసిన ఆకాశ్‌దీప్‌
ఇండియా-ఏ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్‌ అహ్మద్‌ 3, ఆవేశ్‌ ఖాన్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (61), సర్ఫరాజ్‌ ఖాన్‌ (46) మాత్రమే రాణించారు. వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు.

టార్గెట్‌ 275
275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆ జట్టు 198 పరుగులకు ఆలౌటై, 76 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కేఎల్‌ రాహుల్‌ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 

ఆఖర్లో ఆకాశ్‌దీప్‌ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్‌ దయాల్‌ 3, ముకేశ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనపీ తలో 2, సుందర్‌, నితీశ్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement