ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా గాయడపడ్డాడు. తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా స్కై చేతికి గాయమైంది. ఈ కారణంగా అతను దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్‌కు దూరం కానున్నాడు. స్కై దులీప్ ట్రోఫీలో ఇండియా-సికి ఆడాల్సి ఉండింది.
దులీప్ ట్రోఫీలో ఇండియా-సి మ్యాచ్ సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు అనంతపురం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-సి.. ఇండియా-డితో తలపడనుంది. సూర్యకుమార్ గాయపడిన విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. సై.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో రిపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది.
స్కై గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు దూరం కావడంతో టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అతని కలలు కల్లలుగా మారిపోయాయి. స్కై లేకుండానే టీమిండియా మిడిలార్డర్‌లో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఒకవేళ దులీప్ ట్రోఫీలో స్కై ఊహించిన దానికంటే అధికంగా రాణించినా జట్టులో చోటు దక్కడం కష్టమే అవుతుంది.
మిడిలార్డర్‌లో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే తలలు పట్టుకుని కూర్చుంది. దులీప్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో సీనియర్లు మినహా టీమిండియాలో చోటు ఆశిస్తున్న వారంతా పాల్గొంటున్నారు.
దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య సెప్టెంబర్ 5న బెంగళూరు వేదికగా మొదలవుతుంది. అదే రోజు అనంతపురంలో ఇండియా-సి, ఇండియా-డి జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు తలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ టోర్నీ అనంతరం స్వదేశంలోనే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. సెప్టెంబర్ 19న తొలి టెస్ట్, సెప్టెంబర్ 27న రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు టీ20 జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment