చరిత్ర సృష్టించిన జో రూట్‌.. ఆల్‌టైం రికార్డులు బద్దలు | ENG vs SL: Joe Root Creates History For England | Sakshi
Sakshi News home page

ENG vs SL: చరిత్ర సృష్టించిన జో రూట్‌.. ఆల్‌టైం రికార్డులు బద్దలు

Published Sat, Aug 31 2024 8:59 PM | Last Updated on Sun, Sep 1 2024 7:34 AM

ENG vs SL: Joe Root Creates History For England

ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ టెస్టుల్లో త‌న దూకుడును కొన‌సాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో సత్తాచాటిన రూట్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగాడు. 

121 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్‌కు ఇది 34వ టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను రూట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

రూట్‌ సాధించిన రికార్డులు ఇవే..
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా రూట్ అవ‌త‌రించాడు. గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్ట‌ర్‌ కుక్ పేరిట ఉన్న అత్యధిక శ‌తకాల (33) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కుక్ రికార్డును సమం చేసిన రూట్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ సెంచరీతో అతడిని అధిగమించాడు.

ఈ సెంచ‌రీతో అత‌డు మ‌రో ముగ్గురు క్రికెట‌ర్ల అత్య‌ధిక సెంచ‌రీల‌ రికార్డును సమం చేశాడు. యూనిస్ ఖాన్‌, జయవర్దనే, సునీల్‌ గవాస్కర్, లారా రికార్డును సమం చేశాడు. వీరిందరూ టెస్టుల్లో 34 సెంచరీలు చేశారు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ఈజాబితాలో ఆరో స్ధానంలో ఎగబాకుతాడు. ఇక టెస్టు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు.

ఒకే వేదికలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. రూట్ లార్డ్స్‌లో ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉండేది. గూచ్ లార్డ్స్‌లో 6 సెంచ‌రీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో గూచ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.

50 లేదా అంత‌కంటే ఎక్కువ అంత‌ర్జాతీయ సెంచ‌రీలు చేసిన 9వ క్రికెట‌ర్‌గా రూట్ నిలిచాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచ‌రీలు చేశాడు. ఈ జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ 100 సెంచ‌రీల‌తో అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.

డేంజర్‌లో సచిన్ రికార్డు.. 
కాగా రూట్ జోరును చూస్తుంటే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడు. స‌చిన్ త‌న టెస్టు కెరీర్‌లో 15,921 ర‌న్స్‌ చేసి అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో రూట్ 12377 ప‌రుగుల‌తో 7వ స్ధానంలో కొన‌సాగుతున్నాడు. 

కాగా రూట్  స‌చిన్‌కు కేవ‌లం 3,544 పరుగుల దూరంలోనే ఉన్నాడు. సచిన్ 200 టెస్టులు ఆడి త‌న కెరీర్‌ను ముగించ‌గా.. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు 145 టెస్టులు మాత్ర‌మే ఆడాడు. అయితే 33 ఏళ్ల రూట్ ఫిట్‌నెస్ ప‌రంగా కూడా మెరుగ్గా ఉండ‌డంతో స‌చిన్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement