
లండన్: ఇటీవల కాలంలో ఇంగ్లండ్ క్రికెటర్లపై సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువగా కావడంతో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసహనం వ్యక్తం చేశాడు. తన సహచర క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్,. మొయిన్ అలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అందుకు సోషల్ మీడియా బాయ్‌కాట్ ఒక్కటే మార్గమని ఒక సందేశాన్ని ఇచ్చాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అంతా కలిసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌కు చెందిన స్వానిసా, బర్మింగ్‌హమ్, స్కాట్ చాంపియన్స్, రేంజర్స్ ఫుట్‌క్లబ్‌లలోని పలువురు ఆటగాళ్లు తరుచు జాతి వివక్షకు గురౌతున్నారు.
వారిపై జాతి వివక్ష వేధింపులు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ కావడంతో ఆ ప్లాట్‌ఫామ్‌ను బహిష్కరించేందుకు తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడవాలని ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ను కూడా బ్రాడ్ కోరుతున్నాడు. ఆన్‌లైన్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియా బహిష్కరణ ఒక్కటే మార్గమన్నాడు. అలా చేస్తేనే స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుందని బ్రాడ్ తెలిపాడు. ఇది చాలా దారుణమైన అంశమని, దీనిపై ఆ యాప్ క్రియేటర్స్ అయినా చర్యలు తీసుకోవాలన్నాడు. సోషల్ మీడియా పోస్టులు పబ్లిక్‌లోకి వచ్చేముందు వారు జవాబుదారీగా ఉండాలన్నాడు.
కాగా, జోఫ్రా ఆర్చర్‌పై కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో జాతి వివక్ష పోస్టులు పెట్టగా, ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా భారత్‌లో ఉన్న మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్‌లో సంచలన కామెంట్స్ చేశారు. ఈ తరహా పోస్టులను అరికట్టాలంటే సోషల్ మీడియాను బహిష్కరించడమే మార్గమని బ్రాడ్ అంటున్నాడు. ఈ క్రమంలోనే జట్టు మొత్తం కలిసి వస్తే ఒక గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment