ఇంగ్లండ్‌ మళ్లీ బోల్తా | England Vs Sri Lanka Highlights, ICC ODI World Cup 2023: Sri Lanka Beat England By 8 Wickets - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ మళ్లీ బోల్తా

Published Fri, Oct 27 2023 3:49 AM | Last Updated on Fri, Oct 27 2023 8:41 AM

England lost on Sri Lanka by 8 wickets - Sakshi

బెంగళూరు: గత మెగా ఈవెంట్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో సూపర్‌ ఓవర్‌దాకా పోరాడి మరీ పుట్టింటికి ప్రపంచకప్‌ను పట్టుకెళ్లిన ఇంగ్లండ్‌ ఈసారి మాత్రం లీగ్‌ దశలోనే ఇంటికెళ్లే ప్రమాదంలో పడింది. సగం మ్యాచ్‌లు పూర్తయినా ఒక్కటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇకపై ఆడాల్సిన నాలుగు వరుసబెట్టి గెలిచినా... రేసులో నిలవడమైతే అసాధ్యమే! ఇప్పటికే అఫ్గానిస్తాన్‌ జట్టు చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్‌ జట్టును గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో బోల్తా కొట్టించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బట్లర్‌ బృందం 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరులాంటి చిన్నస్వామి స్టేడియంలో ఇది టి20లకు సైతం చిన్నస్కోరు. అలాంటిది వన్డేలకు ఏం సరిపోతుంది. బెన్‌ స్టోక్స్‌ (73 బంతుల్లో 43; 6 ఫోర్లు) చేసిందే టాప్‌ స్కోర్‌! ఇంకో ఇద్దరు ఓపెనర్లు బెయిర్‌స్టో (31 బంతుల్లో 30; 3 ఫోర్లు), మలాన్‌ (25 బంతుల్లో 28; 6 ఫోర్లు)లవి చెప్పుకోదగ్గ స్కోర్లే తప్ప జట్టుకు ఉపయోగపడే పరుగులేమీ కావు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లహిరు కుమార 3, మాథ్యూస్, కసున్‌ రజిత చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.

అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ నిసాంక ( 83 బంతుల్లో 77 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమరవిక్రమ (54 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) గెలిపించారు. నిసాంక 54 బంతుల్లో, సమరవిక్రమ 44 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తిచేశారు. శ్రీలంక 23 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కుదురుగా ఆడి అబేధ్యమైన మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించి జట్టును విజయతీరానికి చేర్చారు. 

నిర్లక్ష్యమే నిండా ముంచింది! 
ఈ మెగా టోర్నీ లో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్, శ్రీలంకలాంటి గట్టి జట్లు 400, 350 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసేస్తుంటే చిన్న స్వామి స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ కనీసం 160 పరుగులైనా చేయలేకపోయింది.

ఓపెనర్‌ బెయిర్‌స్టో నుంచి లోయర్‌ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానం వోక్స్‌ (0) దాకా బ్యాటింగ్‌ సామర్థ్యమున్న జట్టు... మేం ఆడేది వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ కాదన్నట్లు, మాకేం పట్టనట్లు ఆద్యంతం నిర్లక్ష్యం కనబరిచింది. స్టోక్స్‌ ముందు, తర్వాత ఇంకెవరూ అసలు చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. రూట్‌ (3), కెపె్టన్‌ బట్లర్‌ (8), లివింగ్‌స్టోన్‌ (1), మొయిన్‌ అలీ (15) అంతా లంక బౌలింగ్‌కు దాసోహమయ్యారు.  

ఆదిల్‌ ఆదమరుపు కీపర్‌ డైరెక్ట్‌ త్రో మెరుపు 
ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఆదిల్‌ రషీద్‌ తన నిర్లక్ష్యంతో నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లో వికెట్‌ను పారేసుకున్నాడు. 32వ ఓవర్లో తీక్షణ వేసిన ఐదో బంతి లెగ్‌సైడ్‌ దిశగా నేరుగా కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ చేతుల్లో పడింది. అవతలి వైపున్న రషీద్‌ క్రీజు వెలుపల ఉన్నాడు. ఇది గమనించిన మెండిస్‌ గ్లౌజ్‌ తీసి బుల్లెట్‌ వేగంతో నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌ వికెట్లను గిరాటే వేయడంతో రషీద్‌ రనౌటయ్యాడు.  రషీద్‌ అవుటయ్యాక మరో తొమ్మిది బంతులకు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) ధనంజయ (బి) రజిత 30; మలాన్‌ (సి) కుశాల్‌ మెండిస్‌ (బి) మాథ్యూస్‌ 28; జో రూట్‌ (రనౌట్‌) 3; స్టోక్స్‌ (సి) హేమంత (సబ్‌) (బి) లహిరు 43; బట్లర్‌ (సి) కుశాల్‌ మెండిస్‌ (బి) లహిరు 8; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లహిరు 1; అలీ (సి) పెరీరా (బి) మాథ్యూస్‌ 15; వోక్స్‌ (సి) సమరవిక్రమ (బి) రజిత 0; విల్లే (నాటౌట్‌) 14; ఆదిల్‌ రషీద్‌ (రనౌట్‌) 2; వుడ్‌ (స్టంప్డ్‌) కుశాల్‌ మెండిస్‌ (బి) తీక్షణ 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (33.2 ఓవర్లలో ఆలౌట్‌) 156. వికెట్ల పతనం: 1–45, 2–57, 3–68, 4–77, 5–85, 6–122, 7–123, 8–137, 9–147, 10–156. బౌలింగ్‌: మదుషంక 5–0–37–0, కసున్‌ రజిత 7–0–36–2, తీక్షణ 8.2–1–21–1, మాథ్యూస్‌ 5–1–14–2, లహిరు కుమార 7–0–35–3, ధనంజయ 1–0–10–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (నాటౌట్‌) 77; కుశాల్‌ పెరీరా (సి) స్టోక్స్‌ (బి) విల్లే 4; కుశాల్‌ మెండిస్‌ (సి) బట్లర్‌ (బి) విల్లే 11; సమరవిక్రమ (నాటౌట్‌) 65;  ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (25.4 ఓవర్లలో 2 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–9, 2–23. బౌలింగ్‌: వోక్స్‌ 6–0–30–0, డేవిడ్‌ విల్లే 5–0–30–2, ఆదిల్‌ రషీద్‌ 4.4–0–39–0, మార్క్‌ వుడ్‌ 4–0–23–0, లివింగ్‌స్టోన్‌ 3–0–17–0, మొయిన్‌ అలీ 3–0–21–0.  

ప్రపంచకప్‌లో నేడు
పాకిస్తాన్‌ X దక్షిణాఫ్రికా
వేదిక: చెన్నై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement