
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్‌లో స్థానిక మహిళా టీమ్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
సత్తా చాటిన హీథర్ నైట్..
హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్‌కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు.
తడబడిన న్యూజిలాండ్..
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు.
బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment