వరల్డ్‌కప్ లాంటి పెద్ద ఈవెంట్‌లో తుది జట్టు కూర్పు అనేది అన్ని జట్లకు ప్రధాన సమస్యగా పరిగణించబడుతుంది. మెగా టోర్నీ కావడంతో అన్ని జట్లు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. మిగతా జట్ల మాట అటుంచితే.. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో ఈ సమస్య టీమిండియానే అధికంగా వేధిస్తుందని అనిపిస్తుంది. భారత వరల్డ్‌కప్ జట్టులో హేమాహేమీ ఆటగాళ్లు ఉండటంతో ఎవరిని తప్పించాలో, ఎవరిని ఆడించాలో తెలియక మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే తలలుపట్టుకుంది. పిచ్, వాతావరణం, ఆయా ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఆఖరి నిమిషంలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. ఎక్కడో తెలియని భయం కెప్టెన్‌ను, కోచ్‌ను ఇప్పటినుంచే కలవరపెడుతుంది.
తుది జట్టుకు సంబంధించి బ్యాటింగ్ విభాగం, వికెట్‌కీపర్ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉన్నప్పటికీ.. పేస్ బౌలింగ్ విభాగంతో సమస్య వస్తుంది. భారత జట్టుకు ఎంపిక చేసిన ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లలో ముగ్గురూ భీకర ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులో ఎవరిని ఆడించాలో అర్ధం కావడం లేదు. బుమ్రా రీఎంట్రీలో ఇరగదీస్తుండగా.. నంబర్ వన్ వన్డే బౌలర్‌గా సిరాజ్, ఆసీస్‌తో తొలి వన్డేలో అదిరిపోయే 5 వికెట్ల ప్రదర్శనతో షమీ.. ఇలా ముగ్గురూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుని ఇటీవలికాలంలో చెలరేగిపోయారు.
దీంతో వరల్డ్‌కప్ తుది జట్టులో ఎవరిని ఆడించాలో కెప్టెన్‌కు, కోచ్‌కు అర్ధం కావడం లేదు. భారత పిచ్‌లు పేసర్లకు అంతగా సహకరించవు కాబట్టి, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగుదామనుకుంటే, ఏ టైమ్ ఏ పేసర్‌తో అవసరం పడుతుందోనన్న భయం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఇప్పటినుంచే వెంటాడుతుంది. అనుభవం దృష్ట్యా బుమ్రా, షమీలకు అవకాశం ఇస్దామనుకుంటే సిరాజ్ వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా ఉండటంతో పాటు భీకర ఫామ్‌లో ఉన్నాడు.
లేదు షమీని తప్పిస్దామనుకుంటే, అతను కూడా అదిరిపోయే ప్రదర్శనలతో అబ్బురపరిచాడు. బుమ్రాను తప్పించే సాహసం మేనేజ్‌మెంట్ ఎలాగూ చేయలేదు. లేదు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లకు అవకాశం ఇద్దామా అనుకుంటే, అది జట్టు కూర్పు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. దీంతో ఏం చేయాలో మేనేజ్‌మెంట్‌కు పాలుపోవడం లేదు. పిచ్ పరిస్థితిని చూసి ఆఖరి నిమిషంలో డెసిషన్ తీసుకోవడం తప్పించి వారు ఏమీ చేయలేరు. అప్పుడు అవసరం దృష్ట్యా ముగ్గురిలో ఇద్దరిని మాత్రం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మిగతా జట్టు విషయానికొస్తే.. ఓపెనర్లుగా రోహిత్, గిల్ సెట్ అయిపోయారు. వన్‌డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్, ఐదో ప్లేస్‌లో రాహుల్ (వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్), ఆరో స్థానంలో హార్దిక్, ఏడో ప్లేస్‌లో జడేజా, ఎనిమిదో స్థానంలో అశ్విన్, తొమ్మిదో ప్లేస్‌లో కుల్దీప్, 10, 11 స్థానాల్లో బుమ్రా, షమీ, సిరాజ్‌ల్లో ఎవరో ఇద్దరు తుది జట్టులో ఉంటారు. ఇలా కాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండాలనుకుంటే సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరు తుది జట్టులోకి వస్తారు. వరల్డ్‌కప్‌లో భారత తుది జట్టు ఎలా ఉండాలని అనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.
Comments
Please login to add a commentAdd a comment