దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్‌లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్) మెరిశాడు. ముషీర్ తన సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా క్రీజ్‌లో నిలదొక్కుకుని అద్భుత శతకం సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్.. నవ్‌దీప్ సైనీతో (29 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
తొలి మ్యాచ్‌లోనే సెంచరీ..
19 ఏళ్ల ముషీర్ దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. వయసు ప్రకారం చూస్తే ముషీర్ ఇండియా-బి జట్టులో అందరికంటే చిన్నవాడు. ముషీర్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో కేవలం 11 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్‌లో సెకెండ్ హైయ్యెస్ట్ రన్‌గెటర్ అయిన ముషీర్.. గత రంజీ క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆతర్వాత సెమీస్‌లో హాఫ్ సెంచరీ.. ఫైనల్లో సెంచరీ చేశాడు.
టీమిండియా ఫ్యూచర్ స్టార్..
ముషీర్ బ్యాటింగ్ స్టయిల్ చాలా క్లాస్‌గా ఉంటుంది. ముషీర్ ఇప్పటికే తానెంటో రుజువు చేసుకున్నాడు. ముషీర్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముషీర్.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు.
ముషీర్ భారత్ మిడిలార్డర్‌లో అన్నకు పోటీ అయ్యేలా ఉన్నాడు. ముషీర్ ఇదే ఫామ్‌ను దులీప్ ట్రోఫీ మొత్తంలో కొనసాగిస్తే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావడం ఖాయం. తనకంటే సీనియర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ విఫలమైన మ్యాచ్‌లో ముషీర్ సెంచరీ సాధించడం హర్షించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment