న్యూఢిల్లీ: భారత జట్టుకు విశేష సేవలందించి సరైన రీతిలో వీడ్కోలు లభించని క్రికెటర్ల కోసం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర ఆలోచనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన క్రీడాకారులందరికీ చివరగా ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందంటూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే రిటైరైన తనతో పాటు ధోని, సెహ్వాగ్, రైనా, గంభీర్, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ లాంటి ప్లేయర్లతో కోహ్లి సేన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడితే అందరికీ వీడ్కోలు మ్యాచ్ దక్కినట్లవుతుందని పఠాన్ వ్యాఖ్యానించాడు.
(చదవండి: సురేశ్ రైనా.. దుబాయ్ లైఫ్)
‘టీమిండియాకు గొప్ప విజయాలు అందించిన దిగ్గజ ఆటగాళ్లకు సరైన వీడ్కోలు దక్కలేదని ఇప్పటికీ అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుత టీమిండియా జట్టుతో రిటైర్డ్ ఆటగాళ్ల జట్టు చారిటీ మ్యాచ్‌లో ఆడితే అందరికీ చివరి మ్యాచ్ ఆడినట్లు ఉంటుంది’ అని పఠాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు రిటైర్డ్ ప్లేయర్ల జట్టును కూడా పఠాన్ ప్రకటించాడు. అయితే ఈ కరోనా పరిస్థితుల్లోఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ముందుకు వచ్చే అవకాశమే లేదు. పఠాన్ ప్రకటించిన రిటైర్మెంట్ టీమ్ ఆటగాళ్లు: ధోని, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, గంభీర్, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, ప్రజ్ఞాన్ ఓజా, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్.
(చదవండి: ‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’)
Comments
Please login to add a commentAdd a comment