ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి అనంతరం వరుస విజయాలతో దూసుకుపోతున్న అర్జెంటీనాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భారీ షాకిచ్చింది. నిన్న (డిసెంబర్ 10) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మెస్సీ అండ్ టీమ్ చేసిన ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఫిఫా.. వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించింది.
ఇందులో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్యపై డిసిప్లినరీ కేసులను నమోదు చేసింది. దీని ప్రభావం డిసెంబర్ 14న క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది. ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ.. అర్జెంటీనా క్రమశిక్షణారాహిత్యానికి కెప్టెన్ మెస్సీని బాధ్యున్ని చేస్తే క్రొయేషియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనిపై వేటు పడే అవకాశం ఉంది.
మెస్సీతో పాటు ఆ జట్టు గోల్‌కీపర్, మరికొంత మంది ఆటగాళ్లపై కూడా ఫిఫా నిషేధం విధించవచ్చు. ఇదే జరిగితే అర్జెంటీనాకు భారీ షాక్ తగిలినట్టే. సెమీస్‌లో మెస్సీ, గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ బరిలోకి దిగకపోతే అర్జెంటీనా ఓటమిపాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సాకర్ అభిమానులు భావిస్తున్నారు. సెమీఫైనల్లో మెస్సీ ఆడకుండా అడ్డుకుంటే ఫిఫా అంతు చూస్తామని అర్జెంటీనా ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
ఈ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో ఫిఫా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, నిన్న డచ్ టీమ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ ఫైనల్లో అర్జెంటీనా 4-3 (2-2) తేడాతో గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
హోరాహోరీగా సాగిన ఈ సమరంలో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 18 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించగా, ఇందులో అర్జెంటీనా ఆటగాళ్లే 16 సార్లు బాధ్యులయ్యారు. క్వార్టర్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మెస్సీ పోస్ట్‌మ్యాచ్ ఇంటర్య్వులోడీ అంశంపై స్పందిస్తూ.. రిఫరీ, నెదర్లాండ్ స్ట్రైకర్ వౌట్ వెఘోర్స్ట్, డచ్ కోచ్ లుయిస్ వాన్ గాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంటే, డిసెంబర్ 14న జరిగే తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్‌లో రన్నరప్ క్రొయేషియా-అర్జెంటీనా జట్లు తలపడుతుంటే.. డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడనున్నాయి. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment