సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా ఐదువేల పరుగుల మార్కును చేరుకున్న రెండో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఫించ్ రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో తొలి వన్డేలో ఫించ్(114; 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఈ ఫార్మాట్‌లో ఐదు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.ఫలితంగా ఫించ్ 126 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్ తరఫున వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఐదువేల వన్డే పరుగుల్ని సాధించి వేగవంతమైన జాబితాలో తొలి ఆసీస్ క్రికెటర్‌గా ఉంటే, ఆ తర్వాత స్థానాన్ని ఫించ్ ఆక్రమించాడు. ఈ క్రమంలోనే డీన్ జోన్స్ (128 ఇన్నింగ్స్‌ల్లో) స్థానాన్ని ఫించ్ అధిగమించాడు.(హార్దిక్ వీర బాదుడు)
తొలి వన్డేలో ఆస్ట్రేలియా 375 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఫించ్‌తో స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్-శిఖర్ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి మయాంక్ ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ ఆడబోయిన బంతిని మ్యాక్స్‌వెల్ క్యాచ్‌గా పట్టుకోవడంతో మయాంక్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కోహ్లి(21) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరగా, వెంటనే అయ్యర్(2) కూడా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(12) నిరాశపరిచాడు. ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. పాండ్యా-ధావన్‌ల జోడి నిలకడగా ఆడటంతో టీమిండియా తిరిగి గాడిలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment