
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2024కు అధికారికంగా నగారా మోగింది. మార్చి 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ రెండు దశల్లో ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే తొలి దశలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 మధ్య జరిగే 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగిలిన 53 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బోర్డు ప్రకటిస్తుంది.
గత రెండు సీజన్ల తరహాలోనే 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. టోర్నీ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో నాలుగు తేదీల్లో ఒకేరోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ 17 రోజుల్లో ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు గరిష్టంగా ఐదేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి.
అందుకే విశాఖలో...
ఆంధ్ర క్రికెట్ అభిమానులకు ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం దక్కుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ రెండు ‘హోమ్’ మ్యాచ్‌లను వైజాగ్‌లో ఆడాలని నిర్ణయించుకుంది.
క్యాపిటల్స్ సొంత వేదిక ఫిరోజ్‌షా కోట్లా మైదానం మార్చి 17న జరిగే డబ్ల్యూపీఎల్ ఫైనల్ సహా మొత్తం 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. దాంతో ఐపీఎల్‌కు ముందు గ్రౌండ్ సన్నద్ధతకు తగినంత సమయం లభించడం లేదు. ఈ కారణంగా క్యాపిటల్స్ తమ వేదికను వైజాగ్‌కు మార్చింది. విశాఖలో వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 13 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
ఆఖరి సారిగా 2019 లీగ్‌లో ఎలిమినేటర్, క్వాలిఫయింగ్–2 మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా తమ హోమ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు మొహాలి ఈ టీమ్ సొంత గ్రౌండ్‌గా ఉండగా... చండీగఢ్ శివార్ల లో ముల్లన్‌పూర్‌లో కొత్తగా నిరి్మంచిన స్టేడియంలో ఇకపై తమ హోమ్ మ్యాచ్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment