దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై సంకేతాలు ఇచ్చాడు. వచ్చే ఏడాది (2024) జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పునరాగమనాన్ని పరిశీలిస్తున్నట్లు ఫాఫ్ స్వయంగా వెల్లడించాడు. ఈ విషయమై దక్షిణాఫ్రికా వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రాగలనని నమ్ముతున్నానని తెలిపాడు. తన పునరాగమనంపై గత రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని.. టీ20 ప్రపంచకప్ సమయానికి జట్టు సమతూకం విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు.
ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న ఫాఫ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీంట్రీ ఇచ్చే అంశాన్ని తనే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల ఫాఫ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉండిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అతను శుభ్‌మన్ గిల్ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అతను 14 ఇన్నింగ్స్‌ల్లో 730 పరుగులు చేశాడు. ఫాఫ్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను 2020 చివర్లో ఆడాడు. అప్పటినుంచి అతను లీగ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
ఫాఫ్‌ను టీ20 జట్టులో చేర్చుకోవాలని కొత్తగా ఎంపికైన పరిమత ఓవర్ల కోచ్ రాబ్ వాల్టర్ క్రికెట్ సౌతాఫ్రికాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఫాఫ్ ఫిట్‌నెస్ పరంగానూ, టెక్నికల్‌గానూ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాడని వాల్డర్ నమ్ముతున్నాడు. రీఎంట్రీ విషయమై వాల్టర్ మరో దిగ్గజ బ్యాటర్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రీఎంట్రీ ఇచ్చేందుకు డుప్లెసిస్‌కు ఆసక్తి ఉన్నా క్రికెట్ సౌతాఫ్రికా అతన్ని అనుమతిస్తుందో లేదో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లు డిసెంబర్ 10 నుంచి మొదలవుతాయి. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment