French Open 2023- పారిస్: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–2, 7–6 (7/1)తో అలెగ్జాండర్ కొవాసెవిచ్ (అమెరికా)పై గెలుపొందాడు.
2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా 19వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ రెండుసార్లు టైటిల్ సాధించడంతోపాటు నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాడు.
డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) గైర్హాజరీలో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్ ఫ్లావియో కొబొలి (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 6–0, 6–2, 7–5తో విజయం సాధించాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు.
మరోవైపు పదో సీడ్ ఫెలిక్స్ అగుర్ అలియాసిమ్ (కెనడా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) 6–4, 6–4, 6–3తో ఫెలిక్స్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) 7–5, 4–6, 3–6, 6–1, 6–4తో బెనోయి పెయిర్ (ఫ్రాన్స్)పై, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–4, 6–7 (2/7), 1–6, 6–4తో రామోస్ వినోలస్ (స్పెయిన్)పై, షపోవలోవ్ (కెనడా) 6–4, 7–5, 4–6, 3–6, 6–3తో నకషిమా (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
12వ సీడ్ బెన్‌చిచ్ ఓటమి
మహిళల సింగిల్స్ విభాగంలో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ‘లక్కీ లూజర్’ ఎలీనా అలనెస్యాన్ (రష్యా) 6–3, 2–6, 6–4తో బెన్‌చిచ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/4), 4–6, 6–4తో జియు వాంగ్ (చైనా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–0, 6–4తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, కేలా డే (అమెరికా) 7–5, 6–1తో మ్లాడోనోవిచ్ (ఫ్రాన్స్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–2తో మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment