భాగ్యనగరంలో మరోసారి రేసింగ్ చూడాలనుకున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. వచ్చే ఏడాది హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరిలో జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్ రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి లీగ్ నిర్వహణకు ఇంకా అనుమతి రాలేదని 'ఫార్ములా -ఇ' తాజా ప్రకటనలో వెల్లడించింది.
కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఇ-ప్రిక్స్ రేస్ నిర్వహణకు ‘ఫార్ములా -ఇ’ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ‘ఫార్ములా -ఈ’ రేసింగ్ నిర్వహణకు చిక్కులు ఏర్పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు 'ఫార్ములా -ఇ' ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటికే ఫార్ములా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం కొత్త ప్రభుత్వంతో సమావేశమైనట్లు తెలిపింది. అంతేకాకుండా ఈవెంట్ కోసం ఇప్పటికే చాలా సంస్ధలు పెట్టుబడి పెట్టేశాయి అని, ఈ ఏడాది జరిగిన తొలి ఎడిషన్ ద్వారా 84 మిలియన్ల డాలర్ల మేర తెలంగాణ ప్రభుత్వం, నిర్వాహకులకు ఆర్ధిక లబ్ది లభించిందని 'ఫార్ములా -ఇ' పేర్కొంది.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఇ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరంలో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోయాయి. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment