చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన ఫ్రెంచ్‌ ఐకాన్‌.. భార్య ఎవరో తెలిస్తే షాక్‌! | Gael-Monfils-Emotional-Farewell-Played-Career Last Grand Slam Match | Sakshi
Sakshi News home page

చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన ఫ్రెంచ్‌ ఐకాన్‌.. భార్య ఎవరో తెలిస్తే షాక్‌!

Sep 4 2026 12:13 PM | Updated on Sep 4 2026 1:54 PM

Gael-Monfils-Emotional-Farewell-Played-Career Last Grand Slam Match

Photo Credit: Twitter

ఫ్రెంచ్ టెన్నిస్ ఐకాన్‌, సీనియర్‌ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ తన చివరి కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడేశాడు. 2026 సీజన్‌ అనంతరం మోన్‌ఫిల్స్‌ ఆటకు వీడ్కోలు పలుకుతానని ముందే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఓపెన్‌ రూపంలో కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడిన మోన్‌ఫిల్స్ ఓటమి అనంతరం అభిమానులకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యాడు. యూఎస్ ఓపెన్‌లో భాగంగా పురుషులు సింగిల్స్ రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన 20 ఏళ్ల లార్నర్ టైన్ చేతిలో 6-3, 6-4, 6-3తో గేల్ మోన్‌ఫిల్స్ పరాజయం చవిచూశాడు.


Photo Credit: Twitter

ది ఎంటర్‌టైనర్
మైదానంలో అద్భుతమైన విన్యాసాలు, చురుకైన ఆటతీరు, ప్రేక్షకులను అలరించే శైలి మోన్‌ఫిల్స్ సొంతం. అందుకే ఆయన్ను టెన్నిస్‌లో అందూరు "ది ఎంటర్‌టైనర్" (The Entertainer) అని పిలుస్తారు. 40 ఏండ్ల మోన్‌ఫిల్స్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ముందే వెల్లడించాడు. దీంతో మోన్‌ఫిల్స్ ఆడే మ్యాచ్‌లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తాజాగా రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ఫ్రెంచ్ స్టార్‌కు మద్దతుగా ‘మోన్ ఫిల్స్‌.. మోన్‌ఫిల్స్‌’ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.

రెండుసార్లు సెమీస్‌కు..
2004లో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ప్రారంభించిన గేల్ మోన్‌ఫిల్స్  2016 నవంబర్‌లో తన సింగిల్స్‌ కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంకును సాధించడం విశేషం. ఇక మోన్‌ఫిల్స్ 35 ఏటీపీ టూర్ సింగిల్స్ ఫైనల్స్‌లో ఆడి 13సార్లు టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో అతడి అత్యుత్తమ ప్రదర్శన 2008, 2016లో నమోదు చేశాడు. 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన మోన్‌ఫిల్స్ ఆ తర్వాత 2016 యూఎస్ ఓపెన్‌లోనూ మరోసారి సెమీస్ చేరుకున్నాడు.


Photo Credit: Twitter

స్వితోలినాతో ప్రేమ వివాహం
1986లో జన్మించిన మోన్‌ఫిల్స్ మహిళా టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినాతో ప్రేమాయణం నడిపాడు. 2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టిన వీరిద్దరు 2021 ఏప్రిల్‌లో నిశ్చితార్థం, అదే ఏడాది జూలై 16న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కాగా ఎలీనా స్వితోలినా కూడా ప్ర‌స్తుతం మ‌హిళ‌ల టెన్నిస్‌లో స్టార్ ప్లేయ‌ర్‌గా వెలుగొందుతుంది. 

త‌న సింగిల్స్‌ కెరీర్‌లో స్వితోలినా నాలుగు మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఫ్రెంచ్ ఓపెన్‌, ఆస్ట్రేలియన్ ఓపెన్‌, వింబుల్డ‌న్‌, యూఎస్ ఓపెన్‌) ప‌లుమార్లు సెమీస్‌, క్వార్ట‌ర్ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకుంది. త‌న కెరీర్‌లో 2017లో అత్యుత్త‌మంగా డ‌బ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్ అందుకుంది.


Photo Credit: Twitter

తరచూ గాయాలు..
తరచూ గాయాల బారిన పడిన మోన్‌ఫిల్స్ కెరీర్‌లో చాలా గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమయ్యాడు. సింగిల్స్‌లో 588-359గా కెరీర్ రికార్డు ఉంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఫైనాన్స్ (వెల్త్ మేనేజ్‌మెంట్) రంగంలో స్థిరపడనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

Read: నొప్పిని భ‌రిస్తూనే మూడో రౌండ్‌కు మాజీ చాంపియ‌న్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement