
జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌లకు బ్యాలెన్స్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా జింబాబ్వే జట్టులో చేరిన నాలుగు నెలలకే బ్యాలెన్స్ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. గ్యారీ అంతకుమందు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 42 మ్యాచ్‌లు ఆడాడు. 2014 నుంచి 2017 మధ్య ఇంగ్లండ్ తరపున 23 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో 2017లో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో తన సొంత దేశం తరపున ఆడేందుకు జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల ఒప్పందం కుదర్చుకున్నాడు.
జింబాబ్వే తరపున తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై బ్యాలెన్స్ సెంచరీ సాధించాడు. 33 ఏళ్ల గ్యారీ ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 137 పరుగులు చేశాడు. అద్భుతఫామ్‌లో ఉన్న అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాలెన్స్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ నాలుగు నెలలపాటు తనకు మద్దతుగా నిలిచిన జింబాబ్వే క్రికెట్ ధన్యవాదాలు తెలిపాడు.
చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..