గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన | Gautam Gambhir Is The Head Coach Of The Indian Cricket Team, See More Details Inside | Sakshi
Sakshi News home page

గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. ఆటగాడిగా ఘనమైన రికార్డు... 

Published Wed, Jul 10 2024 5:23 AM | Last Updated on Wed, Jul 10 2024 1:15 PM

Gautam Gambhir is the head coach of the Indian cricket team

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

బీసీసీఐ అధికారిక ప్రకటన 

మూడున్నరేళ్ల పాటు పదవీ కాలం  

ముంబై: భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇకపై కొత్త పాత్రలో టీమిండియాతో కలిసి పని చేయనున్నాడు. 43 ఏళ్ల గంభీర్‌ను భారత హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. 

ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. ఇదే సిరీస్‌ నుంచి గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్‌ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది. కొత్త కోచ్‌ కోసం మే 13 నుంచి బీసీసీఐ దరఖాస్తులు కోరింది. అంతకుముందే కోచ్‌ పదవిని స్వీకరించమంటూ మరో మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ను బీసీసీఐ కోరినా... అతను తిరస్కరించాడు.

తన ఆసక్తిని బహిరంగంగానే ప్రకటిస్తూ గంభీర్‌ కూడా దరఖాస్తు చేసుకోగా, ఒక్క డబ్ల్యూవీ రామన్‌ మాత్రమే అతనితో పోటీ పడ్డాడు. ఎలాగూ ముందే నిర్ణయించేశారనే భావన వల్ల కావచ్చు, విదేశీ కోచ్‌లు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు ఊహించినట్లుగా గంభీర్‌కు పగ్గాలు లభించాయి.  

ఆటగాడిగా ఘనమైన రికార్డు... 
2004–2012 మధ్య కాలంలో మూడు ఫార్మాట్‌లలో గంభీర్‌ ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 58 టెస్టుల్లో 41.95 సగటుతో 4154 పరుగులు చేసిన అతను 9 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

37 అంతర్జాతీయ టి20ల్లో 119.02 స్ట్రయిక్‌ రేట్, 7 హాఫ్‌ సెంచరీలతో 932 పరుగులు పరుగులు సాధించాడు. అన్నింటికి మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్‌ రెండు అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో వచ్చాయి. పాకిస్తాన్‌తో 2007 టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో 75 పరుగులతో, శ్రీలంకతో వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

నేపియర్‌లో న్యూజిలాండ్‌తో 11 గంటల పాటు క్రీజ్‌లో నిలిచి 436 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి కాపాడటం టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్‌లో ముందుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్‌ ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారాడు. 2012, 2014లలో కెపె్టన్‌గా కేకేఆర్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించాడు. 
 
కోచ్‌గా తొలిసారి... 
రిటైర్మెంట్‌ తర్వాత చాలామందిలాగే గంభీర్‌ కూడా కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా పని చేశాడు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్‌ ఢిల్లీ నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయిన అతను పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 

అయితే అధికారికంగా కోచ్‌ హోదాలో పని చేయడం గంభీర్‌కు ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌కు 2022, 2023 సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించగా, రెండుసార్లు కూడా లక్నో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరింది. అయితే 2024 సీజన్‌లో కోల్‌కతాకు మెంటార్‌గా వెళ్లిన అతను టీమ్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సాఫల్యమే అతడిని భారత జట్టు కోచ్‌ రేసులో ముందంజలో నిలిపింది. 

మరోవైపు టి20 వరల్డ్‌ కప్‌ వరకు జట్టుతో పని చేసిన విక్రమ్‌ రాథోడ్‌ (బ్యాటింగ్‌ కోచ్‌ ), పారస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), టి.దిలీప్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌) పదవీ కాలం కూడా ముగిసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త బృందాన్ని ఎంచుకునే అధికారం గంభీర్‌కు ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement