
మరో పది, పదిహేనేళ్లలో దేశం క్రీడా భారత్‌గా ఎదుగుతుందని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. చెస్‌లో ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ వేదికల్లో పతకాలతో మెరిశారు.
ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘గతంలో కొన్ని క్రీడలే భారత్‌లో వెలుగొందేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు కవరేజీ, ప్రేక్షకాదరణ బాగా పెరిగాయి’’ అని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ నడుస్తోంది. నేను ఇంగ్లండ్ నుంచే నీరజ్ ఆటను చూశాను.. మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే అని పాడుకునేంతలా అతడు నన్ను ఆకట్టుకున్నాడు.
ఆదివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్ సందర్భంగానూ అచ్చంగా అదే అనుభూతిని పొందాను. రెండేళ్ల క్రితం నీరజ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే, ఈసారి తన అద్భుతమైన త్రోతో స్వర్ణం సాధించాడు’’ అని గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు.
ఇక బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నాడని గావస్కర్ ప్రశంసించాడు. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడా దేశాలుగా భావిస్తారని.. రానున్న 10- 15 ఏళ్లలో భారత్ కూడా స్పోర్టింగ్ కంట్రీగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment