అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఈ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగుల మార్క్‌ను టీమిండియా దాటలేకపోయింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని రోహిత్ సేనను గవాస్కర్ సూచించాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
"ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత జట్టుకు ఓ సలహా ఇవ్వాలనకుకుంటున్నాను. ఇది ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ అని మర్చిపోండి. మూడు టెస్టుల సిరీస్‌గానే భావించండి. అడిలైడ్ టెస్టులో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలి. టెస్టు క్రికెట్‌కు ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మీరేమి టూర్‌కు వెళ్ల లేదు,క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోండి. కాబట్టి హోటల్ గదులకే పరిమితం కావద్దు.
రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేదా మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటే చాలు. కానీ విలువైన ఈ రెండు రోజుల సమయాన్ని మాత్రం వృథా చేయవద్దు. ఈ టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగింటే ఈ సమయంలో మీరు మైదానంలో ఉండేవారు. కాబట్టి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సాధన చేయండి. తిరిగి మీ రిథమ్‌ను పొందేందుకు ప్రయత్నించండి.
ఆప్షనల్ ప్రాక్టీస్‌ను నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను. ప్రాక్టీస్ నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే నిర్ణయించాలి. అంతే తప్ప ఆటగాళ్లకు ఛాయిస్ ఇవ్వకూడదు. అలా చేస్తే ప్రాక్టీస్ వద్దని, రూమ్‌లకే పరిమితమవుతారు.
భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తమకు దక్కిన గౌరవంగా భావించాలి. మొత్తం మీరు 57 రోజులు ఆస్ట్రేలియాలో ఉంటారు. అందులో అయిదు టెస్టులు, ప్రాక్టీస్ మ్యాచ్ కలిపి 27 రోజులు ఆడితే, దాదాపు నెల రోజుల విశ్రాంతి మీకు లభిస్తోంది. అది సరిపోతుంది అనుకుంటున్నాను.
దయచేసి వచ్చి ప్రాక్టీస్ చేయండి. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు సాధన చేయకోపోయిన పర్వాలేదు. ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది. కానీ మిగితా ప్లేయర్లంతా కచ్చితంగా ఈ రెండు రోజులు పాటు శ్రమించాల్సిందేనని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: బాధ్యత బుమ్రా ఒక్కడిదేనా? అందరిదీ: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment