![George Linde powers South Africa to 11 run win over Pakistan](/styles/webp/s3/article_images/2024/12/11/miller.jpg.webp?itok=F8TZ9RcI)
స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాక్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగల్గింది. ఓ దశలో కెప్టెన్ రిజ్వాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ సునాయసంగా లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు.
కానీ ఆఖరి ఓవర్‌లో రిజ్వాన్ ఔట్ కావడం, ఇతరుల నుంచి అతడికి సపోర్ట్ లభించకపోవడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 19 పరుగుల అవసరమవ్వగా.. సఫారీ యువ పేసర్ మఫాక కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(62 బంతుల్లో 74, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూబ్(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. బాబర్ ఆజం(0)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో జార్జ్ లిండీ 4 వికెట్లు పడగొట్టగా.. మఫాక రెండు, సీమ్‌లేన్, బార్ట్‌మన్ తలా వికెట్ సాధించారు.
డేవిడ్ మిల్లర్ ఊచకోత..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రోటీస్ టాపర్డర్ విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాట్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అర్బర్ ఆహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో డిసెంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది.
చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment