పాకిస్తాన్ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు రెడ్ బాల్ (టెస్ట్) కోచ్ జేసన్ గిల్లెస్పీ జట్టుతో పాటు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న పరిణామాలే గిల్లెస్పీ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.
పీసీబీ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో గిల్లెస్పీ కలత చెందాడని సమాచారం. గిల్లెస్పీ ఇవాళ (డిసెంబర్ 12) పాక్ టెస్ట్ జట్టుతో కలిసి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే పాక్ జట్టు ప్రయాణించిన విమానంలో గిల్లెస్పీ జాడ కనబడలేదు. దీంతో ఆయన తన రాజీనామాను పీసీబీకి పంపినట్లు ప్రచారం జరుగతుంది. ఈ అంశంపై పీసీబీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.
గిల్లెస్పీ ఈ ఏడాది ప్రారంభంలో పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. గిల్లెస్పీ-పీసీబీ మధ్య రెండేళ్లకు ఒప్పందం కుదిరింది. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అయితే బంగ్లా సిరీస్ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా పీసీబీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల పట్ల గిల్లెస్పీ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.
పాక్ వైట్ బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే గిల్లెస్పీ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గిల్లెస్పీతో పాటు కిర్‌స్టన్ పాక్ హెడ్ కోచ్‌లుగా నియమించబడ్డారు. పాక్ జట్టుకు ఇద్దరు విదేశీ కోచ్‌లు ఆరు నెలలు కూడా నిలదొక్కుకోలేకవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిల్లెస్పీ గైర్హాజరీలో పాక్ రెడ్ బాల్ టీమ్ తాత్కాలిక బాధ్యతలను కూడా ఆకిబ్ జావిదే మొయవచ్చు. జావిద్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పాక్ తాత్కాలిక వైట్ బాల్ కోచ్‌గా నియమించబడ్డ విషయం తెలిసిందే.
ప్రస్తుతం పాక్ పరిమిత ఓవర్ల జట్లు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నాయి. టీ20, వన్డే సిరీస్‌ల అనంతరం పాక్ సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. రెండు టెస్టులు సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి), కేప్ టౌన్ (జనవరి 3 నుంచి) వేదికలుగా జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment