రాయల్ లండన్ వన్డే కప్ (ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్) 2024 ఎడిషన్ విజేతగా గ్లామోర్గన్ జట్టు అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సోమర్‌సెట్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా షెడ్యూల్డ్ తేదీన మ్యాచ్ రద్దు కాగా రిజర్వ్ డేలో నిర్వహించారు. ఈ రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించడంతో 20 ఓవర్స్ ఫార్మాట్‌లో మ్యాచ్‌ను జరిపారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సామ్ నార్త్‌ఈస్ట్ అజేయ అర్ద సెంచరీతో (49 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బిల్లీ రూట్ (39), విలియమ్ స్మేల్ (28), వాన్ డెర్ గుగ్టెన్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సోమర్‌సెట్ బౌలర్లలో జార్జ్ థామస్, అల్ఫీ ఒగ్బోమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ గ్రీన్, అల్‌డ్రిడ్జ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సోమర్‌సెట్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోమర్‌సెట్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ ఉమీద్ (45), సీన్ డిక్సన్ (44), ఆర్చీ వాన్ (32 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
గ్లామోర్గన్ బౌలర్లలో ఆండీ గార్విన్, బెన్ కాల్లావే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్ డౌట్‌వెయిట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీలో నిన్నటితో ముగిసింది. గ్లామోర్గన్ వన్డే కప్ టైటిల్ సాధించడం ఇది రెండో సారి. 2021 సీజన్‌లో ఈ జట్టు డర్హమ్‌పై విజయం సాధించి, తొలి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా లీసెస్టర్‌ఫైర్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment