IPL 2023, RCB Vs GT Highlights: Gujarat Titans Beat Royal Challengers Bangalore By 6 Wickets - Sakshi
Sakshi News home page

బెంగళూరు ఖేల్‌ఖతం 

Published Mon, May 22 2023 1:59 AM | Last Updated on Mon, May 22 2023 9:01 AM

Gujarat Titans beat Royal Challengers Bangalore by 6 wickets - Sakshi

బెంగళూరు: కోహ్లి తన జట్టు గెలిచేందుకు చేయాల్సిందంతా చేశాడు. కానీ బెంగళూరు చెత్త బౌలింగ్, అడ్డూఅదుపు లేని ఎక్స్‌ట్రాలు అతని శ్రమను నీరుగార్చింది. దీంతో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచింది. ఈ ఓటమితో బెంగళూరు ప్లే ఆఫ్‌ దశకు అర్హత పొందలేకపోయింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది.

కోహ్లి (61 బంతుల్లో 101 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తర్వాత గుజరాత్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (52 బంతుల్లో 104 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో గుజరాత్‌ను గెలిపించాడు. విజయ్‌ శంకర్‌ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. 

ఆఖరి దాకా కోహ్లినే... 
మొన్న హైదరాబాద్‌ ఆటనే కోహ్లి బెంగళూరులో రిపీట్‌ చేశాడు. ఓపెనింగ్‌లో డుప్లెసిస్‌ (19 బంతు ల్లో 28; 5 ఫోర్లు)తో మంచి ఆరంభం ఇచ్చాడు. డుప్లెసిస్‌ అవుటయ్యాక మ్యాక్స్‌వెల్‌ (11), మహిపాల్‌ (1) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీకి కోహ్లినే పెద్దదిక్కయి నడిపించాడు.

బ్రేస్‌వెల్‌ (16బంతుల్లో 26; 5 ఫోర్లు) అండతో కోహ్లి మళ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న బ్రేస్‌వెల్‌ను షమీ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయగా, దినేశ్‌ కార్తీక్‌ (0) నిరుత్సాహపరిచాడు. అనూజ్‌ రావత్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) అండతో కోహ్లి 60 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (నాటౌట్‌) 101; డుప్లెసిస్‌ (సి) తెవాటియా (బి) నూర్‌ అహ్మద్‌ 28; మ్యాక్స్‌వెల్‌ (బి) రషీద్‌ 11; మహిపాల్‌ (స్టంప్డ్‌) సాహా (బి) నూర్‌ అహ్మద్‌ 1; బ్రేస్‌వెల్‌ (సి అండ్‌ బి) షమీ 26; కార్తీక్‌ (సి) సాహా (బి) యశ్‌ 0; అనూజ్‌ (నాటౌట్‌ ) 23; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–67, 2–80, 3–85, 4–132, 5–133. బౌలింగ్‌: షమీ 4–0–39–1, యశ్‌ 4–0–39–1, రషీద్‌ 4–0–24–1, నూర్‌ 4–0–39–2, మోహిత్‌ 4–0–54–0. గుజరాత్‌

టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) పార్నెల్‌ (బి) సిరాజ్‌ 12; గిల్‌ (నాటౌట్‌) 104; విజయ్‌ (సి) కోహ్లి (బి) వైశాక్‌ 53; షనక (సి) సబ్‌–ప్రభుదేశాయ్‌ (బి) హర్షల్‌ 0; మిల్లర్‌ (సి) సబ్‌–ప్రభుదేశాయ్‌ (బి) సిరాజ్‌ 6; తెవాటియా (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–25, 2–148, 3–150, 4–171. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–32–2, పార్నెల్‌ 3.1–0–42–0, వైశాక్‌ 4–0– 40–1, హిమాన్షు 3–0–28–0, హర్షల్‌ 4–0–29–1, బ్రేస్‌వెల్‌ 1–0–16–0.   


ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ 
మే 23: క్వాలిఫయర్‌–1 
గుజరాత్‌ టైటాన్స్‌ VS  చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి 

మే 24: ఎలిమినేటర్‌ 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ VS ముంబై  ఇండియన్స్‌
వేదిక: చెన్నై; రాత్రి గం. 7:30 నుంచి 

మే 26: క్వాలిఫయర్‌–2 
క్వాలిఫయర్‌–1లో  ఓడిన జట్టు VS  ఎలిమినేటర్‌  విజేత 
వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7:30 నుంచి 

మే 28: ఫైనల్‌ 
క్వాలిఫయర్‌–1 విజేత VS క్వాలిఫయర్‌–2 విజేత 
వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7:30 నుంచి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement