గుజరాత్ టైటాన్స్ (PC: BCCI/IPL)
IPL 2024- Blow To Gujarat Titans: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం.
షమీ మడిమ నొప్పి తీవ్రతరమైన నేపథ్యంలో అతడు సర్జరీ కోసం యూకే వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత భారత రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే.
వరల్డ్‌కప్‌లో ఇరగదీసి
సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చినా.. తనకు అవకాశం రాగానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు షమీ. ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. మొత్తంగా 24 వికెట్లు తీశాడు.
తద్వారా వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. కాగా ఎడమకాలి మడిమ నొప్పి వేధిస్తున్నా బాధను పంటిబిగువన భరిస్తూ షమీ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు.
అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్‌కూ దూరమయ్యాడు. అయితే, మార్చిలో ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా.. బీసీసీఐ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇది అసాధ్యమేనని తెలుస్తోంది.
లండన్‌లో చికిత్స?
మడిమ నొప్పి చికిత్సకై షమీ లండన్ వెళ్లనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. అరంగేట్రంలోనే జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
గత సీజన్‌లో 17 మ్యాచ్‌లలో కలిపి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీమిండియా నయా సూపర్‌స్టార్, యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. షమీ రూపంలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
చదవండి: Yashasvi Jaiswal: టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా! కోట్లు పెట్టి కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment