గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిభతో ముందుకు దూకుతున్నారు ఆ హైజంపర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అచంచల ఆత్మ విశ్వాసంతో క్రీడా సాధన చేస్తున్నారు. పార్ట్‌టైం జాబ్ చేస్తూనే రాణిస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుని తన సత్తాచాటారు షేక్ మొహిద్దీన్.
పేద కుటుంబం
మొహిద్దీన్‌ది కాకుమాను మండలం రేటూరు గ్రామం. తండ్రి షేక్ షంషుద్దీన్ పదేళ్ల క్రితం మరణించారు. తల్లి నూర్జహాన్ గృహిణి. ఇంటి వద్దే పాలవ్యాపారం చేస్తున్నారు. మొహిద్దీన్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలిస్తున్నారు. ఇద్దరక్కలు పెళ్లిళ్లై వెళ్లిపోయారు. ప్రస్తుతం మొహిద్దీన్ ఇంటి వద్ద పాలు పోస్తూనే గుంటూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి వరకు హైజంప్ సాధన చేస్తున్నారు.
పోటీకి వెళితే పతకమే
హైజంప్ వైవిధ్యమైన క్రీడ. పోటీ తక్కువగా ఉన్నా, సాధనలో తేడా వస్తే వైకల్యం సంభవించే అవకాశం ఉంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మొహిద్దీన్ ఏ పోటీలకు వెళ్లినా పతకం సాధించి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 20కుపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10 బంగారు, మరో 10 రజత, కాంస్య పతకాలు సాధించారు.
ఏడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. అన్నింటా ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పూర్తిగా సాధనలో నిమగ్నమైతే దేశానికి అతి త్వరలోనే ప్రాతినిధ్యం వహించే అవకాశముందని అతని శిక్షకులు అంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలు కావడంలేదు.
స్పాన్సర్‌షిప్ ఇప్పించండి
ఖేలో ఇండియా నేషనల్స్‌లో కూడా 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేశాను. ఇది బెస్ట్ మీట్ రికార్డ్. అందుకే కాంస్య పతకం వచ్చింది. సాధన, పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్‌షిప్ ఇప్పించాలని మనవి. ఇటీవల శాప్ పెద్దలను కలిశాను. ఒక్క ఏడాది మనస్సుపెట్టి సాధన చేస్తే తప్పకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను.
హైజంప్‌కు నా దేహం చాలా బాగా సహకరిస్తుందని జాతీయస్థాయి శిక్షకులూ చెప్పారు. ఎప్పటికై నా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరిక – షేక్ మొహిద్దీన్, నేషనల్ హైజంపర్.
చదవండి: సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ షురూ..
ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్
Comments
Please login to add a commentAdd a comment