టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర స్టార్ ఆటగాడు హనుమ విహారి ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై విహారి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో అజింక్య రహానే టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు, తాను చేయలేనా అని అన్నాడు. రహానే లాంటి వెటరన్ ఆటగాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభపరిమాణమని, టాలెంట్ ఉన్న ఆటగాడికి వయసుతో సంబంధం లేదని రహానే నిరూపించాడని, టీమిండియాలో తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది స్పూర్తినిస్తుందని పేర్కొన్నాడు. తన వయసు 29 మాత్రమేనని, టీమిండియాకు ఆడేందుకు తనకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు.
2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. విహారి పార్ట్ టైమ్ బౌలర్‌గానూ పర్వాలేదనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 2021 సిడ్నీ టెస్ట్ మ్యాచ్ విహారికి మంచి గుర్తింపు తెచ్చింది.
ఇక రహానే విషయానికొస్తే.. ఐపీఎల్ 2023లో ఇరగదీసిన ఈ ముంబైకర్.. ఆ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా టెస్ట్‌ల్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇదే స్పూర్తితో విహారి సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment