గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించి, నిత్యం దూకుడుగా కనిపించే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రియల్ లైఫ్‌లోనూ అదే తరహాలో మోసగాళ్లకు చుక్కలు చూపించి, వారి చెరలో నుంచి ఓ అమాయక యువతికి విముక్తి కల్పించాడు. ప్రస్తుతం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న భజ్జీ.. గల్ఫ్‌లో మోసగాళ్ల చెరలో చిక్కుకున్న ఓ యువతిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన కమల్జీత్ అనే 21 ఏళ్ల యువతి ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఓమన్‌కు వెళ్లాలనుకుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ ఏజెంట్‌ను కలిసి వీసా తదితర ఏర్పాట్లు చేయాలని కొరింది. కమల్జీత్ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఏజెంట్.. ఆమెకు మాయమాటలు చెప్పి గత నెలలో మస్కట్‌కు పంపించాడు. మస్కట్‌లో ఓ హిందూ కుటుంబానికి వంట చేసే పని ఉందని.. మంచి జీతం, వసతి ఉంటాయని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే ఏజెంట్ చెప్పినవేవీ అక్కడ జరగకపోవడంతో కమల్జీత్ మోసపోయానని తెలుసుకుంది.
కమల్జీత్‌ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి పాస్ పోర్ట్, సిమ్ కార్డ్ లాక్కొని ఆమెను ఓ గదిలో బంధించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని బయట పడిన కమల్జీత్ తండ్రికి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించింది. కమల్జీత్ తండ్రి విషయం తెలిసిన వెంటనే తెలిసిన వ్యక్తుల ద్వారా స్థానిక ఎంపీ హర్భజన్‌ను కలిశాడు. జరిగినదంతా భజ్జీకి వివరించాడు.
ఇది విని చలించిపోయిన భజ్జీ వెంటనే మస్కట్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. దీంతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి కమల్జీత్‌కు మోసగాళ్ల చెర నుంచి విముక్తి కల్పించి సురక్షితంగా భారత్‌కు పంపించారు. దీంతో కమల్జీత్, ఆమె కుటుంబసభ్యులు హర్భజన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీరు గ్రౌండ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ హీరోలు అంటూ కొనియాడారు.
చదవండి: పసికూనలు చెలరేగుతున్న వేళ, టీమిండియాకు ఎందుకీ దుస్థితి..?
Comments
Please login to add a commentAdd a comment