
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు కాస్త విరామం దొరికితే చాలు భార్యాపిల్లలతో గడిపేందుకే సమయం కేటాయిస్తాడు . ముఖ్యంగా కొడుకు అగస్త్యతో కలిసి చిన్నపిల్లాడిలా మారి అల్లరి చేస్తూ ఉంటాడు. తన గారాలపట్టిని ముద్దు చేస్తూ లైఫ్ ఆల్బమ్‌లో ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకోవడం అతడికి అలవాటు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పాండ్యా జీవిత భాగస్వామి నటాషా.. తండ్రీకొడుకుల ప్రేమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేస్తారన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె.. ‘‘నా సర్వస్వం’’ అంటూ మరో వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2021 సీజన్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అతడు నటాషా, అగస్త్యతో కలిసి బయో బబుల్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో తన రూంలో రెస్ట్ తీసుకుంటున్న పాండ్యా.. కొడుకును ఆడిస్తుండగా నటాషా.. ఆ దృశ్యాలను వీడియోలో బంధించారు.
ఇందులో పాండ్యా.. అగస్త్యను లాలిస్తూ, ఆత్మీయంగా జోకొడుతుండగా, ఆ బుడ్డోడు తండ్రిని హత్తుకుంటున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో ఒకే వేదికలో అన్ని మ్యాచ్‌లను నిర్వహించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. కాగా ముంబై ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా, నాలుగింటిలో గెలుపొంది, మూడింటిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment