దుబాయ్: దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించి అయిదో సారి ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఘన విజయాన్ని తన కొడుకు అగస్త్యకు అంకితమిచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది.
మ్యాచ్ అనంతరం.. హార్దిక్ ‘ఇది నీకోసమే.. అగస్త్య’ అంటూ ట్రోఫీని లిఫ్ట్ చేస్తున్న ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు. కాగా.. హార్దిక్ పాండ్య, భార్య నటాషా దంపతులకు జులై 30న అగస్త్య జన్మించిన సంగతి తెలిసిందే. అయితే.. హార్దిక్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 281 పరుగులు చేసి 178.98 స్ట్రైక్‌రేట్‌తో అద్భుత ప్రదర్శన కనపరిచాడు. అందులో 25 సిక్సర్లు బాదడం విశేషం. ముంబై ఇండియన్స్ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా బౌలింగ్‌కి దూరమైనా, తన బ్యాటింగ్‌తో ముంబైని విజయతీరాలకి చేర్చాడు. (నేను అలాంటి వాడిని కాదు: రోహిత్)
మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌల్ట్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే స్టొయినిస్ వెనుదిరగ్గా, అజింక్య రహానే, శిఖర్ ధావన్ అదే బాట పట్టారు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అర్ధ సెంచరీలతో జట్టు స్కోర్ 156కి చేరింది. 157 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి డికాక్ శుభారంభాన్ని అందించగా, రోహిత్ శర్మ దానిని కొనసాగించాడు. తర్వాత అనవసరపు సింగిల్ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం క్రీజ్‌లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై లక్ష్యం వైపు దూసుకుపోయింది. మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించి అయిదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. (ముంబై ఇండియన్స్ పాంచ్ పటాకా)
Comments
Please login to add a commentAdd a comment