టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌లోనే భారత్ నిష్క్రమించిన తర్వాత రోహిత్ శర్మ.. దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు. అతడి గైర్హాజరీలో పాండ్యా టీ20లలో టీమిండియాను ముందుకు నడిపించాడు.
పాండ్యా గాయపడిన సందర్బాల్లో భారత నంబర్ వన్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరిద్దరు అందుబాటులో లేని సమయంలో రిషభ్ పంత్ సైతం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.
శాశ్వత కెప్టెన్ కోసం కసరత్తు
ఇక టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో తిరిగి పొట్టి ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ కాకుండా సుదీర్ఘకాలం పాటు టీ20లలో టీమిండియాను ముందుకు నడిపే ఆటగాడినే ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
తరచూ గాయాలు
ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్-2024 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తరచూ గాయాల బారిన పడే ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బోర్డులోని కొందరు వ్యక్తులు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాకే తమ ఓటు అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
ముఖ్యంగా హార్దిక్ ఫిట్‌నెస్ విషయంలో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించినప్పటికీ గాయాల బెడద సమస్యగా మారింది.
సూర్య సూపర్ అని చెప్పారు
మరోవైపు.. సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పటికే మేము ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అతడి కెప్టెన్సీ పట్ల ఆటగాళ్లంతా సానుకూలంగా ఉన్నారు. సూర్య హయాంలో డ్రెసింగ్‌రూం వాతావరణం కూడా చాలా బాగా ఉందని చెప్పారు’’ అని పేర్కొన్నాయి.
కాగా ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో హార్దిక్ పాండ్యా ఇప్పటికే చాలా సార్లు గాయపడ్డాడు. గాయాల భయంతోనే అతడు టెస్టు క్రికెట్‌కు కూడా పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.
కెప్టెన్సీ భారం వల్ల
ఫిట్‌నెస్ విషయంలో తరచూ సమస్యల బారిన పడుతున్న ఇలాంటి ఆటగాడిని పూర్తిస్థాయి కెప్టెన్ చేయడం పట్ల బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆల్‌రౌండర్‌పై హార్దిక్ ప్రదర్శనపై కెప్టెన్సీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే టీ20లలో సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలిచాడు.
గంభీర్ ఓటు ఎవరికో?
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచింది.
తదుపరి జూలై 27న మొదలయ్యే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు భారత్ సిద్ధం కానుంది. ఈ టూర్‌తోనే గంభీర్ హెడ్‌కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్ ఎంపిక విషయంలో అతడి అభిప్రాయం కూడా ప్రధానం కానుంది.
చదవండి: నో రెస్ట్: కోహ్లి, రోహిత్, బుమ్రా ఆడాల్సిందే.. గంభీర్ అల్టిమేటం?!
Comments
Please login to add a commentAdd a comment