ముంబై: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, ఆకర్షణీయమైన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2024 సీజన్ ఆరంభానికి చాలా ముందే ఆ జట్టులో సారథ్య మార్పు జరిగింది. 11 సీజన్ల పాటు టీమ్‌కు అద్భుత విజయాలు అందించి ముంబై ఇండియన్స్ ముఖచిత్రంగా మారిన కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు టీమ్ యాజమాన్యం ప్రకటించింది.
రోహిత్ స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్‌గా నియమించింది. గత నెల 26న గుజరాత్ జెయింట్స్ టీమ్ నుంచి హార్దిక్‌ను ముంబై తీసుకున్నప్పటి నుంచే భవిష్యత్తులో అతనికి కెపె్టన్సీ అప్పగించే అవకాశం ఉందని వినిపించింది. అయితే అది ఇంత తొందరగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
ఈ సీజన్ వరకు రోహిత్ నాయకత్వంలో ఆడి వచ్చే ఏడాది నుంచి అతను పగ్గాలు చేపట్టవచ్చని భావించగా... ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ముంబైని ఐపీఎల్‌లో విజేతగా నిలిపిన సారథి రోహిత్ ఇప్పుడు ‘మాజీ’గా మారిపోయాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతంలోనే బెంగళూరు కెపె్టన్సీ నుంచి తప్పుకోగా, 2008 నుంచి చెన్నైకి సారథిగా ఉన్న ధోని ఇంకా కెపె్టన్‌గా కొనసాగుతున్నాడు.
అందుకే మార్పు...
2024 సీజన్ నుంచే హార్దిక్‌కు కెపె్టన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే అన్నాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్ కెపె్టన్లుగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచే హార్దిక్ కెపె్టన్‌గా బాధ్యతలు చేపడతాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై టీమ్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు.
ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని అతను చెప్పాడు. 2015–2021 మధ్య ముంబైతో ఉన్న హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్‌లు ఆడి నాలుగు టైటిల్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన అతను ఒకసారి ట్రోఫీ అందించాడు.
ఐదు ఐపీఎల్ ట్రోఫీలు...
ఐపీఎల్‌లో ముంబై కెపె్టన్‌గా రోహిత్ ముద్ర అసామాన్యం. 2013 సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఏడో మ్యాచ్ నుంచి సారథిగా వ్యవహరించిన రోహిత్ ఆ ఏడాది జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో కూడా ముంబై ఐపీఎల్ గెలుచుకుంది.
2013 చాంపియన్స్ ట్రోఫీ కూడా రోహిత్ నాయకత్వంలోనే వచ్చింది. రోహిత్ సారథ్యంలో జట్టు మొత్తం 158 మ్యాచ్‌లు ఆడగా... అందులో 87 విజయాలు, 67 పరాజయాలు ఉన్నాయి. 4 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. అయితే 2021, 2022 సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో ముంబై విఫలం కాగా... 2023లో రెండో క్వాలిఫయర్‌లో ఓడి మూడో స్థానంతో ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment