
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవ్వగా.. షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇక భారత బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. తిలక్ మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ తొలి టీ20లో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయామని హార్దిక్ తెలిపాడు.
అతడొక సంచలనం.. కొంచెం కూడా భయపడలేదు
లక్ష్యమేమి మరి అంత పెద్దది కాదు. మేము టార్గెట్‌ను సునాయసంగా ఛేజ్ చేస్తామని భావించాను. మా ఇన్నింగ్స్ మధ్య వరకు గెలుపు దిశగానే సాగింది. కానీ మేము కొన్ని తప్పులు చేశాం. అందుకే మేము ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఎక్కడైనా యువ జట్టు చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. టీ20 క్రికెట్‌లో వరుసగా వికెట్లు కోల్పోతే లక్ష్యాన్ని ఛేదించడం కొంచెం కష్టమవుతుంది.
సరిగ్గా మా విషయంలో కూడా అదే జరిగింది. ఆ సమయంలో ఒకట్రెండు భారీ షాట్‌లు మా నుంచి వచ్చి వుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాం. కుల్దీప్, చాహల్ మణికట్టు స్పిన్నర్లగా, అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకున్నాం. ముఖేష్ కుమార్ టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు.
అతడు వికెట్లు సాధించికపోయినప్పటికీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మూడు ఫార్మాట్‌లలోనూ డెబ్యూ చేశాడు. అదే విధంగా తిలక్ వర్మ ఒక యువ సంచలనం. తొలి మ్యాచ్‌లో తిలక్ ఆడిన ఇన్నింగ్స్ నన్ను ఎంతోగానే అకట్టుకుంది. అతడు సిక్సర్లతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. అతడిలో కొంచెం కూడా భయం కనపడలేదు. కచ్చితంగా అతడు భారత్ తరపున అద్భుతాలు సృష్టిస్తాడు. ఇక ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment