కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అందుకు తానే నిదర్శనం అని.. సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని చెబుతున్నాడు.
ఎన్నో ఎత్తుపళ్లాలు
వన్డే వరల్డ్‌కప్-2023 - టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల మధ్యకాలంలో హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా మార్పులే వచ్చాయి. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాడు ఈ బరోడా క్రికెటర్.
సొంతడ్డపై వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో టీమిండియా జోరు మీదున్న తరుణంలో హార్దిక్ పాండ్యా అనూహ్య రీతిలో గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తున్నపుడు రిటర్న్ క్యాచ్‌కు యత్నించి విఫలమైన ఈ ఆల్‌రౌండర్.. అదుపుతప్పి పడిపోయాడు.
ఈ క్రమంలో కాలు మెలిక పడగా చీలమండ నొప్పి ఎక్కువైంది. ఫలితంగా అతడు మైదానం వీడక తప్పలేదు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు.
అక్కడా చేదు అనుభవమే
అయితే, క్యాష్ రిచ్‌లీగ్‌లోనూ అతడికి చేదు అనుభవమే మిగిలింది. సొంత జట్టు అభిమానులే సారథిగా హార్దిక్ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మైదానం లోపలా, వెలుపలా ఆగ్రహం వెళ్లగక్కారు.
ఈ క్రమంలో కెప్టెన్సీలో తడబడిన హార్దిక్ పాండ్యా తన నిర్ణయాల కారణంగా భారీ మూల్యమే చెల్లించాడు. ఆటగాడిగా, సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. మొట్టమొదటిసారి ముంబై కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిపాడు.
దీంతో విమర్శల పదును పెరగడంతో పాటు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ చోటు ఇవ్వకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, అదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో అతడికి స్థానం దక్కింది.
ఇక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావించిన హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. మెగా టోర్నీలో తన తాను నిరూపించుకుని.. టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఫైనల్లో అదరగొట్టి
ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఉత్కంఠతో కూడిన ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు పాండ్యా. తనను ఎక్కడైతే అవమానించారో అదే ముంబై స్టేడియంలో వరల్డ్‌కప్ హీరోగా నీరాజనాలు అందుకున్నాడు.
తాజాగా.. వన్డే వరల్డ్‌కప్ సమయంలో ఎదురైన గడ్డు పరిస్థితులు, ఫిట్‌నెస్ విషయంలో తాను పడ్డ శ్రమకు సంబంధించిన విషయాల గురించి హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఫిట్‌నెస్ ముఖ్యం
‘‘2023 వరల్డ్‌కప్.. గాయం కారణంగా అత్యంత కష్టంగా గడిచింది. అయితే, టీ20 ప్రపంచకప్ విజయంతో ఆ బాధను మర్చిపోగలిగాను. ప్రయత్నిస్తే తప్పక ఫలితం దక్కుతుంది.
కఠినంగా శ్రమిస్తే తప్పక గుర్తింపు లభిస్తుంది. నా లాగే మీ అందరూ కూడా ఫిట్‌నెస్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వండి’’ అంటూ ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా ఆరు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. అదే విధంగా.. 7.64 ఎకానమీతో 11 వికెట్లు కూడా తీశాడు.
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలు తలెత్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఇప్పటికే విడాకుల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతుండగా.. కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్లడం గమనార్హం.
శ్రీలంక పర్యటనకు వెళ్తాడా?
జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. అయితే, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
తరచూ గాయాల బారిన పడుతున్న పాండ్యా కాకుండా సూర్య జట్టును సమర్థవంతంగా ముందుకు నడపగలడని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ జర్నీ పోస్ట్ పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment