ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. అతడిదంతా నటన | Hardik Smiling Too Much Acting Like: England Great Criticises MI Captain | Sakshi
Sakshi News home page

#Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా..

Published Mon, Apr 15 2024 1:34 PM | Last Updated on Mon, Apr 15 2024 3:11 PM

Hardik Smiling Too Much Acting Like: England Great Criticises MI Captain - Sakshi

ఎంఐ ప్రధాన పేసర్‌ బుమ్రాతో హార్దిక్‌ పాండ్యా

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. రోహిత్‌ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడాన్ని ఇష్టపడని ‘ముంబై అభిమానులు’.. అవకాశం దొరికినప్పుడల్లా అతడిని హేళన చేస్తూనే ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్‌ పాండ్యాకు ఈ చేదు అనుభవాలు తప్పడం లేదు. టాస్‌ మొదలు.. మ్యాచ్‌ మధ్యలో ఫీల్డింగ్‌ సెట్‌ చేసే సమయంలో అతడిని గేళి చేయడం.. అతడి వ్యక్తిగత ఆట తీరును విమర్శించడం వంటివి చేస్తున్నారు.

హార్దిక్‌ పాండ్యా చెత్త కెప్టెన్సీ కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించి.. ఓసారి టైటిల్‌ కూడా గెలిచిన హార్దిక్‌.. ఎంఐ జట్టుతో చేరిన తర్వాత ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు.

చిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ విమర్శలపాలవుతున్నాడు పాండ్యా. ఈ క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ఐపీఎల్‌ కామెంటేటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ వ్యూహాలేమిటో అర్థం కాలేదు.

మ్యాచ్‌ ఆరంభానికి ఓ ఐదు గంటల ముందు ప్లాన్‌ ‘ఏ’ అనుకుంటే.. మైదానంలో దిగిన తర్వాత పరిస్థితికి తగ్గట్లు ప్లాన్‌ ‘బి’ కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి కదా! 

పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో స్పిన్నర్‌ను బరిలోకి దించని కెప్టెన్‌ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా?’’ అని హార్దిక్‌ పాండ్యా తీరును ఘాటుగా విమర్శించాడు.

అయితే, అదే సమయంలో హార్దిక్‌ పాండ్యాకు అండగా నిలబడ్డాడు పీటర్సన్‌. హార్దిక్‌ సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడని.. నిజానికి అతడు ఏమాత్రం సంతోషంగా లేడని అన్నాడు. అతడు కూడా మనిషేనని..  దయచేసి ఈ టీమిండియా ప్లేయర్‌ను గేళి చేయవద్దంటూ అభిమానులకు విజప్తి చేశాడు.

‘‘టాస్‌ సమయంలో హార్దిక్‌ మరీ ఎక్కువగా స్మైల్‌ ఇస్తున్నాడు. నిజానికి తాను సంతోషంగానే ఉన్నానని చెప్పడానికి చేస్తున్న నటన అది. చాలా మంది పాండ్యాను హేళన చేస్తూ అరుస్తూ ఉన్నారు. 

అదే ముంబై సొంతమైదానంలో సీఎస్‌కే బ్యాటర్‌ ధోని ముంబై మీద సిక్సర్లు(పాండ్యా బౌలింగ్‌) బాదుతుంటే కేరింతలు కొట్టారు. హోం గ్రౌండ్‌లో ఇలా జరగడం ఏ ఆటగాడినైనా బాధిస్తుంది. తనకూ భావోద్వేగాలు ఉంటాయి. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్లలో ఒకడు. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని కెవిన్‌ పీటర్సన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్‌ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో ఓటమి నమోదు చేసింది. ఇప్పటి వరకు కేవలం రెండు విజయాలు సాధించింది.

చదవండి: #DHONI: ‘మరేం పర్లేదు’.. రోహిత్‌ను ఓదార్చిన ధోని.. ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement