టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు నిరాశ ఎదురైంది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) అవార్డును పాక్ పేసర్ హరీస్ రౌఫ్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం హరీస్ రౌఫ్‌తో పాటు బుమ్రా, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్ పోటీపడ్డారు. అంతిమంగా అవార్డు హరీస్ రౌఫ్‌నే వరించింది.
రౌఫ్ నవంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రౌఫ్ ప్రదర్శనల కారణంగా రెండు దశాబ్దాల తర్వాత పాక్ ఆస్ట్రేలియాను వారి సొండగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రౌఫ్ ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో పాక్ ఆసీస్‌పై 2-1 తేడాతో గెలుపొందింది.
అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రౌఫ్ సత్తా చాటాడు. పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో రౌఫ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ సిరీస్ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ రౌఫ్ రాణించాడు. ఈ సిరీస్‌లో రౌఫ్ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా రౌఫ్ నవంబర్ నెలలో 18 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు.
వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న డానీ వ్యాట్
నవంబర్ నెలకు గానూ మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్‌కు చెందిన డానీ వ్యాట్ గెలుచుకుంది. నవంబర్ నెలలో సౌతాఫ్రికాపై అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వ్యాట్ ఈ అవార్డు గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని మూడు టీ20ల్లో వ్యాట్ 163.21 స్ట్రయిక్ రేట్‌తో 142 పరుగులు చేసింది.
ఇదే సిరీస్‌లో వ్యాట్ టీ20ల్లో 3000 పరుగుల అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ అవార్డు కోసం వ్యాట్ షర్మిన్ అక్తెర్, నదినే డి క్లెర్క్‌లతో పోటీపడింది.
Comments
Please login to add a commentAdd a comment