ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్.
జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు.
మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు.
ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment