Harris Shield Trophy
-
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
మ్యాచ్ అంటే ఇది.. జట్టులోని సభ్యులంతా డకౌట్
ముంబై: క్రికెట్లో అద్భుతాలు జరగడం అంటే ఇదేనేమో. క్రికెట్లో ఎక్కువ మంది డకౌటైతేను ఇదేం బ్యాటింగ్‌రా అనుకుంటాం. కానీ మొత్తం జట్టులోని సభ్యులంతా సున్నాకే పరిమితమైతే ఏమనుకోవాలి. మ్యాచ్ అంటే ఇదీ అనుకోవడం తప్పితే ఏం చేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. అది ఏ స్థాయి మ్యాచ్ అయినా కానీ వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు డకౌట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోతే ఏమవుతుంది. ఘోర పరాజయం ఎదరవుతుంది. అలా క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది చిల్డ్రన్స్ అకాడమీ అంథేరీ స్కూల్ టీమ్. హార్రిస్ షీల్డ్ అండర్-16 టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆజాద్ మైదానంలో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ బోరివాలీతో జరిగిన మ్యాచ్‌లో చిల్డ్రన్స్ అకాడమీ అంధేరీ జట్టు 754 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వారు ఛేదించాల్సిన లక్ష్యం 761 పరుగులు కాగా, కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. మొత్తం జట్టంతా సున్నాకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఓపెనర్లు మొదలుకొని కడవరకూ డకౌట్లనే కొనసాగించింది అంథేరీ చిల్డ్రన్స్ జట్టు. స్వామి వివేకానంద బౌలర్లలో అలోక్ పాల్ ఆరు వికెట్లతో అంథేరీ డకౌట్ల పతనాన్ని శాసించగా, వరాద్ వాజే రెండు వికెట్లు తీశాడు. ఇక రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 605 పరుగులు చేసింది. వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ మయేకర్ (338) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కాగా, 45 ఓవర్లను అంథేరీ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవంతో 156 పరుగుల పెనాల్టీ పడింది. దాంతో అంథేరీ లక్ష్యం 761 పరుగులు అయ్యింది. -
హారిస్ షీల్డ్ ప్రచారకర్తగా సచిన్!
ముంబై: హారిస్ షీల్డ్ ట్రోఫీ... ముంబై స్కూల్ క్రికెట్లో సంచలనాలకు వేదికైన టోర్నీ. 1988లో ఈ టోర్నీలో భాగంగానే శారదాశ్రమ్ విద్యామందిర్ పాఠశాల తరఫున ఆడుతూ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు ఆ టోర్నీకి మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే సచిన్‌కు తెలియజేయగా, అతను సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. రిటైర్మెంట్ తర్వాత ప్రాథమిక స్థాయి క్రికెట్‌కు తన సహకారం అందించేందుకు సచిన్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడని ముంబై స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫాదర్ జూడ్ రెడ్రిగ్స్ వెల్లడించారు. ‘హారిస్ షీల్డ్ టోర్నీని చరిత్రలో భాగం చేసిన ఘనత సచిన్‌దే. ఈ టోర్నీకి ప్రచారకర్తగా ఉండాలని మేం ఇప్పటికే చెప్పాం. ఇది 99 శాతం ఓకే అయినట్లే. అతను మాతో కలిసి పని చేస్తే అది మాకెంతో గర్వకారణం’ అని ఆయన అన్నారు. 11 ఏళ్ల వయసులో తొలిసారి హారిస్ షీల్డ్ టోర్నీ ఆడిన సచిన్ ఈ టోర్నీలో మొత్తం ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ప్రపంచ రికార్డు భాగస్వామ్యంలో సచిన్ 326 పరుగులతో, కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రంజీ బరిలో... వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ముంబై తరఫున రంజీట్రోఫీ మ్యాచ్ కూడా ఆడాలని సచిన్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 27 నుంచి 30 వరకు లాహ్లిలో హర్యానాతో జరిగే మ్యాచ్‌లో మాస్టర్ బరిలోకి దిగుతాడు. సచిన్‌తోపాటు జహీర్‌ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆడతాడని ముంబై టీం మేనేజ్మెంట్ వెల్లడించింది.