ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు.
ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్‌కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.
తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.
20వ స్థానానికి పడిపోయిన కోహ్లి
ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్‌లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్‌వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు.
రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment