అదే అత‌డి బ‌లం.. టీమిండియా కెప్టెన్ కాగ‌లడు: అంబ‌టి రాయుడు | He Is Being Under Used By Indian Cricket Rayudu Drops Future Captain Hint | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్సీ రేసులో కొత్త పేరు.. అంబ‌టి రాయుడు కీల‌క వ్యాఖ్య‌లు

Published Thu, Nov 30 2023 12:16 PM | Last Updated on Thu, Nov 30 2023 12:35 PM

He Is Being Under Used By Indian Cricket Rayudu Drops Future Captain Hint - Sakshi

టీమిండియా (PC: BCCI)

టీమిండియా యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు ప్ర‌శంస‌లు కురిపించాడు. రుతు ప్ర‌తిభావంతుడ‌ని.. భ‌విష్య‌త్తులో భార‌త జ‌ట్టు కెప్టెన్ కాగ‌ల స‌త్తా ఉన్న‌వాడ‌ని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి సేవ‌ల‌ను దీర్ఘ‌కాలం పాటు ఉప‌యోగించుకుంటే మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

కాగా దేశ‌వాళీ క్రికెట్‌లో మ‌హారాష్ట్ర కెప్టెన్‌గా జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌.. బ్యాట‌ర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్లో ప్ర‌పంచ రికార్డులు సాధిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాట‌ర్.. టీమిండియా త‌ర‌ఫున వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సంద‌ర్భంగా  సంచ‌ల‌న సెంచ‌రీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 100 ప‌రుగుల మార్కును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్‌.. 57 బంతుల్లో 123 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. 

ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ బ్యాట‌ర్ అంబ‌టి రాయుడు ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ ఒక‌ప్ప‌టి త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు రుతు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.  “ప్రస్తుతం  భార‌త క్రికెట్ ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటున్న ఆట‌గాడు ఎవ‌రంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పొచ్చు. అత‌డు అత్యంత ప్ర‌తిభావంతుడు. భ‌విష్య‌త్తులో జ‌ట్టుకు మ‌రింత ఉప‌యోగ‌ప‌డ‌తాడు.

త‌న‌కున్న టాలెంటే త‌న బ‌లం. షాట్ సెల‌క్ష‌న్‌, అనుకున్న రీతిలో త‌న వ్యూహాల‌ను అమ‌లు ప‌రిచే విధానం.. అన్నింటికీ మించి ఫిట్‌నెస్ విష‌యంలో శ్ర‌ద్ధ రుతును మ‌రింత ప్ర‌త్యేకంగా నిలుపుతున్నాయి. 

కూల్‌గా తన ప‌ని తాను చేసుకుపోతాడు.  ఏం చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో త‌న‌కు తెలుసు. సైలెంట్‌గా ఉంటూనే దూకుడు ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. టీమిండియాకు దొరికిన విలువైన ఆట‌గాడు. ఇలా చెప్ప‌డం తొంద‌ర‌పాటే అయినా.. ధోని భాయ్ రిటైర్ అయిన త‌ర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా రుతుకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి.

భ‌విష్య‌త్తులో టీమిండియా సార‌థి అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ఆసియా క్రీడ‌ల్లో జ‌ట్టును ముందుండి న‌డిపించాడు” అని అంబ‌టి రాయుడు పేర్కొన్నాడు. కాగా చైనాలో జ‌రిగిన ఏసియ‌న్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన రుతు భార‌త్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం అందించాడు.

కాగా ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో టీమిండియా సార‌థిగా రోహిత్ శ‌ర్మ త‌ర్వాత హార్దిక్ పాండ్యా ప‌గ్గాలు చేప‌ట్ట‌నుండ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు ఇప్పుడు రుతురాజ్ పేరు కూడా వార్త‌ల్లో నిలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement