లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ (ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్), శ్రీశాంత్ (గుజరాత్ జెయింట్స్) గొడవపడ్డారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ సందర్భంగా ఈ ఇద్దరు బాహాబాహీకి దిగినంత పని చేశారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం గొడవ మొదలైంది. వరుస బంతుల్లో 10 పరుగులు రావడంతో సహనం కోల్పోయిన శ్రీశాంత్.. ఆమరుసటి బంతిని డాట్ బాల్‌గా మలిచి గంభీర్‌ను కవ్వించాడు.
అసలే ముక్కోపి అయిన గంభీర్.. శ్రీశాంత్ కవ్వింపుకు నోటితో సమాధానం చెప్పాడు. మ్యాచ్ మధ్యలో కొద్ది సేపు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సహచర ఆటగాళ్లు ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంపైర్లు ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగకుండా వారించారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. గంభీర్-శ్రీశాంత్ కొట్టుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. గొడవ సద్దుమణిగిన అనంతరం మ్యాచ్ సాఫీగా సాగింది. గొడవ తర్వాత గంభీర్ మరింత చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను 30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.
Heated conversation between Gautam Gambhir and S Sreesanth in the LLC. pic.twitter.com/Cjl99SWAWK
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023
ఈ మ్యాచ్‌లో గంభీర్‌తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 3 ఓవర్లు వేసిన శ్రీశాంత్ వికెట్ పడగొట్టి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్..క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో లక్ష్యానికి దగ్గర వరకు వెళ్లి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
కాగా, గంభీర్, శ్రీశాంత్‌లకు గొడవలేమీ కొత్త కాదు. ఈ ఇద్దరూ మైదానంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఆటగాళ్లతో బాహాబాహీకి దిగారు. గంభీర్.. విరాట్ కోహ్లి, షాహిద్ అఫ్రిది లాంటి వారితో గొడవపడగా. శ్రీశాంత్ సహచరుడు హర్భజన్ సింగ్ చేతిలో చెంపదెబ్బ తిని వార్తల్లో నిలిచాడు. గంభీర్ ఇటీవలి ఐపీఎల్ సీజన్ సందర్భంగానూ విరాట్ కోహ్లితో గొడవపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment