![Here Is How Much Virat Kohli Has Run Between Wickets In International Cricket - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/Untitled-7.jpg.webp?itok=0tUJJ6_U)
అంతర్జాతీయ క్రికెట్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (2023 ఆగస్ట్ 18) ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. కోహ్లి తన 15 ఏళ్ల కెరీర్‌లో పరుగులు (బౌండరీలు, సిక్సర్లు కాకుంగా) సాధించే క్రమంలో ఏకంగా 500 కిలోమీటర్లుపైగా పరిగెట్టాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. ఇందులో కోహ్లి తాను చేసిన పరుగుల కోసం 277 కిలోమీటర్లు.. సహచర బ్యాటర్ల పరుగుల కోసం మరో 233 కిలీమీటర్లు పరిగెట్టాడని సదరు వెబ్‌సైట్ ప్రకటించింది. మొత్తంగా కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌లో 510 కిలోమీటర్లు పరిగెట్టాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డేటా లేనప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో బహుశా ఏ క్రికెటర్ కూడా వికెట్ల మధ్య ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉండడని తెలుస్తుంది. ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే కోహ్లికి మాత్రమే ఇది సాధ్యపడుతుందని అతని అభిమానులు అంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రొఫెషనల్ అథ్లెట్లకు కూడా సాధ్యపడని ఈ ఫీట్‌ను కింగ్ కోహ్లి మాత్రమే సాధించాడని కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లి తాను పరుగులు సాధించి, సహచరులు పరుగులు సాధించడంలోనూ భాగం కావడంతో పాటు ప్రత్యర్ధులను సైతం పరుగులు పెట్టించాడని (ఫీల్డింగ్), ఈ లెక్కన కోహ్లి ప్రమేయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయా క్రికెటర్లు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారో లెక్కిస్తే 1000 కిలోమీటర్ల మార్కు ఈజీగా దాటుతుందని అంటున్నారు.
2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో కోహ్లి విశ్వరూపాన్ని (పరుగుల మధ్య పరిగెట్టడంతో) చూసామని, ఆ మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ సాధించకుండా తీసిన నాలుగు పరుగులను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడని అంటున్నారు. వికెట్ల మధ్య పరిగెట్టే సమయంలో కోహ్లిలోని వేగం, చురుకుదనం ఏ క్రికెటర్‌కు ఉండవని.. కోహ్లి క్రికెటర్ కాకపోయుంటే కచ్చితంగా సక్సెస్‌పుల్ అథ్లెట్ అయ్యేవాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కాలక్రమంలో కోహ్లి ఏరకంగా రాటుదేలాడో.. ఎన్ని పరుగులు, రికార్డులు,సెంచరీలు చేశాడో విశ్వం మొత్తం చూసింది.
Comments
Please login to add a commentAdd a comment