Pakistan Star Big Statement: నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్.. ఆఖరి వరకు విజయం ఎవరిదో తేలని సందర్భాల్లో తరచూ వాడే పదం.. చూసే ప్రేక్షకులకే ఇలా ఉంటే.. మరి మైదానంలో స్వతహాగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు ఎలా ఉంటుంది! ఎవరి సంగతి ఎలా ఉన్నా తనకైతే గుండెపోటు వచ్చినంత పని అవుతుందంటున్నాడు పాకిస్తాన్ యువ సంచలనం నసీం షా.
శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో 142 పరుగులతో జయభేరి మోగించిన బాబర్ ఆజం బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.
ఓపెనర్లు అదరగొట్టడంతో
హొంబన్‌టోట వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 151 పరుగులు, ఇబ్రహీం జర్దాన్ 80 పరుగులతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ ఇమామ్-ఉల్- హక్(91) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ 48 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపడేశాడు.
మరో బంతి మిగిలి ఉండగానే..
అయితే, ఆఖరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, టెయిలెండర్ నసీం షా ఆఖరి ఓవర్ ఐదో బాల్‌కు ఫోర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాక్ కథ సుఖాంతమైంది. అఫ్గనిస్తాన్‌ను దురదృష్టం వెక్కిరించడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది.
గుండెపోటు మాత్రం రావొద్దు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నసీం షా మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది నాకు ఇన్నింగ్స్ ముగించే ఛాన్స్‌లు వస్తున్నాయి. ఏదో ఒకరోజు నాకు గుండెపోటు మాత్రం రావొద్దు. ఆ అల్లా ఆశీసులు ఇలాగే ఎల్లప్పుడూ నాపై ఉండాలి. ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను నేను తేలికగానే అధిగమిస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. కాగా పెషావర్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ నసీం షా 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఆసియా కప్-2023కి ముందు
ఇప్పటి వరకు మొత్తంగా 17 టెస్టుల్లో 51, 10 వన్డేల్లో 25, 19 టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత పాక్ ఆసియా కప్-2023కి సన్నద్ధమవుతుంది. ఈ మెగా టోర్నీకి ప్రకటించిన జట్టులో 20 ఏళ్ల నసీం షా కూడా సభ్యుడు. కీలక ఈవెంట్‌కు ముందు నసీం చేసిన తాజా కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడే భయపడితే ఎలా.. ముందుంది ముసళ్ల పండుగ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కోహ్లి కాదు! వరల్డ్‌కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment