మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని భారత జట్టు ఘోర ఓటమితో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది.
ఈ ఓటమితో హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు.. గ్రూపు-ఎలో న్యూజిలాండ్, పాకిస్థాన్,శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు కలిసి ఉంది. ప్రస్తుతం టీమిండియా -2.900 రన్‌రేట్‌తో గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో ఉంది.
సెమీస్ చేరాలంటే?
భారత్ సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంకా భారత్‌కు మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఉమెన్ ఇన్ బ్లూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది.
భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే తమ తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగుపడుతోంది. ఆ తర్వాత తమ చివరి లీగ్‌లో మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ సాధారణ విజయం సాధించినా చాలు సెమీఫైనల్‌కు ఆర్హత సాధించవచ్చు.
ఒకవేళ ఆసీస్‌పై భారత్ ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. కాగా గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు ఖాయం. అయితే ఇదే సమయంలో ఆసీస్ మినహా పాక్, శ్రీలంక, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడాలి. అప్పుడే ఈ మూడు జట్ల కంటే భారత్ పాయింట్లు ఎక్కువగా సాధించి సెమీస్‌లో అడుగు పెడుతోంది.
చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment