
బ్యాంకాక్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ ఆటకు గ్రూప్ దశలోనే తెరపడింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో 30 ఏళ్ల భారత స్టార్‌కు సెమీస్ చేరే అవకాశం చేజారింది. ఇక గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడి రావడమే మిగిలింది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–23, 21–17, 19–21తో చైనాకు చెందిన లు గ్వాంగ్ జు చేతిలో పరాజయం పాలయ్యాడు. 84 నిమిషాల పాటు జరిగిన సమరంలో భారత ఆటగాడు చైనీస్ ప్రత్యరి్థతో హోరాహోరీగా తలపడ్డాడు. గ్రూపులో మిగిలిపోయిన నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్... ఒలింపిక్ చాంపియన్, నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో తలపడతాడు. శుక్రవారం ఈ మ్యాచ్ జరుగుతుంది.