BWF World Superseries Finals
-
BWF World Tour Finals : మళ్లీ ఓడిన ప్రణయ్
బ్యాంకాక్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ ఆటకు గ్రూప్ దశలోనే తెరపడింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో 30 ఏళ్ల భారత స్టార్‌కు సెమీస్ చేరే అవకాశం చేజారింది. ఇక గ్రూప్ ‘ఎ’లో ఆఖరి మ్యాచ్ ఆడి రావడమే మిగిలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–23, 21–17, 19–21తో చైనాకు చెందిన లు గ్వాంగ్ జు చేతిలో పరాజయం పాలయ్యాడు. 84 నిమిషాల పాటు జరిగిన సమరంలో భారత ఆటగాడు చైనీస్ ప్రత్యరి్థతో హోరాహోరీగా తలపడ్డాడు. గ్రూపులో మిగిలిపోయిన నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ ప్రణయ్... ఒలింపిక్ చాంపియన్, నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో తలపడతాడు. శుక్రవారం ఈ మ్యాచ్ జరుగుతుంది. -
శభాష్ సింధు
గ్వాంగ్జౌ (చైనా): ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదురైనా... అలసట తన కదలికలపై ప్రభావం చూపిస్తున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన పీవీ సింధు అనుకున్న ఫలితాన్ని సాధించింది. తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది. 54 నిమిషాలపాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. తొలి గేమ్ ఆరంభంలో ఇరువురు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఈ క్రమంలోనే చెరొక పాయింట్‌ను సాధిస్తూ 2-2, 4-4, 7-7 గా నిలుస్తూ వచ్చారు. ఆ సమయంలో సింధు విజృంభించింది. స్కోరును మూడు పాయింట్ల తేడాకు తీసుకుపోయింది. దాంతో సింధు 10-7 తో ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపును కడవరకూ కొనసాగించిన సింధు మొదటి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఆపై రెండో గేమ్‌లో రచనోక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలుత 6-3 తేడాతో పైచేయి సాధించిన సింధు.. ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోతూ వచ్చింది. దాంతో ఇరువురి మధ్య రెండు పాయింట్లు, పాయింట్ మాత్రమే ఆధిక్యం కొనసాగింది. అయితే ఎక్కడా అలసిపోని సింధు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చివర్లో సింధు రిటర్న్ షాట్లకు కచ్చితమైన జవాబు ఇవ్వలేని రచనోక్ మ్యాచ్‌ను కోల్పోయింది. -
సింధు శుభారంభం
దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తొలి రోజు భారత స్టార్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేయగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ పరాజయాన్ని చవిచూశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హీ బింగ్జియావో (చైనా)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సింధు 21–11, 16–21, 21–18తో గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. పదునైన స్మాష్‌లు సంధిస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే రెండో గేమ్‌లో బింగ్జియావో తేరుకుంది. పలుమార్లు స్కోరు సమమైనా కీలకదశలో ఈ చైనా ప్లేయర్ పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 2–4తో వెనుకబడినా వెంటనే కోలుకొని 5–5తో స్కోరును సమం చేసింది. అదే జోరులో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 17–21తో ఓడిపోయాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న శ్రీకాంత్ తొలి గేమ్‌లో 8–4తో ముందంజ వేసినా ఆ తర్వాత తడబడ్డాడు. అక్సెల్సన్ జోరు పెంచి స్కోరును సమం చేయడంతోపాటు 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచి అక్సెల్సన్ ఆధిపత్యం చలాయించి శ్రీకాంత్‌కు మరో అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు తలపడతారు. -
రెండో మ్యాచ్ కోల్పోయిన సైనా నెహ్వాల్
కౌలాంపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రెండో మ్యాచ్ కోల్పోయింది. తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి గురువారం జరిగిన రెండవ లీగ్ మ్యాచ్‌లో 27 నిమిషాల్లో 9-21, 14-21తో వరల్ఢ్ నెంబర్ వన్ జురుయ్ లీ( చైనా) చేతిలో ఓడిపోయింది. అయితే సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఈ ఏడాది తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 21-19, 22-24, 19-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడిపోయింది.