దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తొలి రోజు భారత స్టార్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేయగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ పరాజయాన్ని చవిచూశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హీ బింగ్‌జియావో (చైనా)తో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సింధు 21–11, 16–21, 21–18తో గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. పదునైన స్మాష్‌లు సంధిస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే రెండో గేమ్‌లో బింగ్‌జియావో తేరుకుంది. పలుమార్లు స్కోరు సమమైనా కీలకదశలో ఈ చైనా ప్లేయర్ పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 2–4తో వెనుకబడినా వెంటనే కోలుకొని 5–5తో స్కోరును సమం చేసింది. అదే జోరులో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది.
చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 17–21తో ఓడిపోయాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న శ్రీకాంత్ తొలి గేమ్‌లో 8–4తో ముందంజ వేసినా ఆ తర్వాత తడబడ్డాడు. అక్సెల్‌సన్ జోరు పెంచి స్కోరును సమం చేయడంతోపాటు 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచి అక్సెల్‌సన్ ఆధిపత్యం చలాయించి శ్రీకాంత్‌కు మరో అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు తలపడతారు.
సింధు శుభారంభం
Published Thu, Dec 14 2017 12:57 AM | Last Updated on Thu, Dec 14 2017 12:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment