గ్వాంగ్‌జౌ (చైనా): ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదురైనా... అలసట తన కదలికలపై ప్రభావం చూపిస్తున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన పీవీ సింధు అనుకున్న ఫలితాన్ని సాధించింది. తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.
54 నిమిషాలపాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. తొలి గేమ్ ఆరంభంలో ఇరువురు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఈ క్రమంలోనే చెరొక పాయింట్‌ను సాధిస్తూ 2-2, 4-4, 7-7 గా నిలుస్తూ వచ్చారు. ఆ సమయంలో సింధు విజృంభించింది. స్కోరును మూడు పాయింట్ల తేడాకు తీసుకుపోయింది. దాంతో సింధు 10-7 తో ఆధిక్యంలో నిలిచింది.
అదే ఊపును కడవరకూ కొనసాగించిన సింధు మొదటి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఆపై రెండో గేమ్‌లో రచనోక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలుత 6-3 తేడాతో పైచేయి సాధించిన సింధు.. ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోతూ వచ్చింది. దాంతో ఇరువురి మధ్య రెండు పాయింట్లు, పాయింట్ మాత్రమే ఆధిక్యం కొనసాగింది. అయితే ఎక్కడా అలసిపోని సింధు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చివర్లో సింధు రిటర్న్ షాట్‌లకు కచ్చితమైన జవాబు ఇవ్వలేని రచనోక్ మ్యాచ్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment